నందిగం సురేష్ ఎన్నిక చెల్లదు‌.. రాష్ట్రపతికి ఫిర్యాదు..

By అంజి  Published on  10 March 2020 10:31 AM GMT
నందిగం సురేష్ ఎన్నిక చెల్లదు‌.. రాష్ట్రపతికి ఫిర్యాదు..

మన దేశంలో ఇప్పటికి కుల రాజకీయాలే కొనసాగుతున్నాయి. కులాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయ నాయకులు పదవులను పొందుతున్నారు. ఏ ఎన్నిక జరిగిన అందులో కులమే ప్రధాన పాత్ర పోషిస్తోంది. అలాంటి కులం పట్ల రాజకీయ నాయకులు చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే కుల వివాదంలో చిక్కుకోవడం తప్పదు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ఎంపీ ఇలాగే కుల వివాదంలో చిక్కుకున్నారు.

గుంటూరు జిల్లా బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ను కుల వివాదం చుట్టు ముట్టింది. గత లోక్‌సభ ఎన్నికల్లో నందిగం సురేష్‌ బాపట్ల ఎస్వీ రిజర్వుడు స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. సురేష్‌కు బాపట్ల లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు సీఎం జగన్‌ అవకాశం కల్పించారు. ఓ సాధారణ కార్యకర్త నుంచి సీఎం జగన్‌ అతిసన్నిహితుడిగా ఉంటూ నందిగం సురేష్‌ తనకున్న పలుకుడితో ఏకంగా బాపట్ల లోక్‌సభ నుంచి పోటీ చేసి గెలిచాడు. ఇటీవల తూళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంకు చెందిన ఎంపీ నందిగం సురేష్‌పై కుల ఆరోపణలు వచ్చాయి.

వైసీపీ ఎంపీ సురేశ్‌ ఎస్సీ కాదని.. క్రిస్టియన్‌ అంటూ ఆరోపణలు చేశారు. తాజాగా ఇదే విషయమై లీగల్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌.. ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి పోటీ చేసే అర్హత సురేష్‌కు లేదని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసింది. అతడి ఎన్నికను రద్దు చేయాలని ఫిర్యాదులో పేర్కొంది. వెంటనే నందిగం సురేష్‌ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఫిర్యాదు చేశారు. మరీ నిజంగానే నందిగం సురేష్‌ ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి పోటీ చేశారా అనేది తెలియాల్సి ఉంది. ఎన్నికల అభ్యర్థిత్వంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడంపై సురేష్‌కు షాక్‌ తగలినట్లైంది.

1950 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం దళిత వ్యక్తి ఇస్లాం లేదా క్రైస్తవంలోకి మతం మారితే ఇక ఎస్సీ హోదా ఉండదు. దీని ఆధారంగానే నందిగం సురేష్‌పై ఫిర్యాదు చేశారు. క్రైస్తవుడిగా మారి కూడా ఎస్సీ రిజర్వుడ్‌ స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన అంశాన్ని రాష్ట్రపతి ముందుంచారు. కాగా ఇప్పటికే ఏపీలో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీల అభ్యర్థిత్వంపై ఫిర్యాదులు నమోదు అయ్యాయి. గతంలో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి విషయంలో కూడా ఇలాంటి ఫిర్యాదులే వచ్చాయి. డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి సంబంధించి కూడా ఇలాంటి ఫిర్యాదు నమోదు అయ్యింది. పుష్ఫ శ్రీవాణి కొండదేవర తెగకు చెందిన వ్యక్తి కాదంటూ చేసిన ఫిర్యాదు గత నెలల క్రితంలో ఏపీలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Next Story