రియల్ హీరో అనిపించుకున్న అక్షయ్.. మరోసారి భారీ విరాళం
By తోట వంశీ కుమార్ Published on 10 April 2020 2:24 PM GMTకరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి పై పోరుకు ఒక్కొక్కరు ఒక్కో రకంగా సాయం అందిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ రూ.25కోట్లు ప్రధాన మంత్రి సహాయనిధికి విరాళంగా అందించిన సంగతి తెలిసిందే. అక్షయ్ అంత పెద్ద మొత్తం ఇవ్వడం పై అతడి భార్య ట్వింకిల్ అసహానం వ్యక్తం చేసినా అక్షయ్ కుమార్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు.
తాజాగా మరోసారి అక్షయ్ భారీ విరాళం ప్రకటించాడు. ముంబై మున్నిపల్ కార్పొరేషన్‌కు రూ.3కోట్ల విరాళం అందజేయనున్నట్లు ప్రకటించాడు. మున్సిపల్ కార్మికుల ఆరోగ్యం కోసం పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్‌కు(పీపీఈ) ఈ డబ్బును అందజేయనున్నాడు. అక్షయ్ కుమార్ విరాళం గురించి ప్రముఖ సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. మొత్తంగా కరోనా పై పోరుకు అక్షయ్ కుమార్ రూ.28 కోట్ల విరాళంగా ఇచ్చాడు. దీంతో సోషల్ మీడియాలో అక్షయ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. నువ్వు రీల్ హీరో వి మాత్రమే కాదు.. రియల్ హీరో అని పలువురు అభిమానులు కామెంట్లు చేశారు.
ముంబైలో కేవలం రూ. 200 లతో అడుగుపెట్టానని చెప్పిన అక్షయ్.. ఎన్నో సార్లు ఆకలితో పస్తులు ఉన్నానని తెలిపాడు. ప్రస్తుతం తాను ఈ స్థితిలో ఉండడానికి కారణం ప్రజలేనని తెలిపాడు. అలాంటి ప్రజలు కష్టాల్లో ఉంటే.. ఆదుకోవడం తన ధర్మం అంటూ ఇటీవల సోషల్ మీడియాలో అక్షయ్ పేర్కొన్న సంగతి తెలిసిందే.