పట్టణీకరణ వల్ల ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 Nov 2019 1:11 PM ISTన్యూఢిల్లీ : దేశ రాజధానిలో తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్న కాలుష్యానికి కేవలం సాగు వ్యర్థాలను మండించడంమాత్రమే ఏకైక కారణం కాదని వాతావరణ నిపుణులు అంటున్నారు. 1991 నుంచి 2016 వరకూ నాసా తీసిన ఉపగ్రహ చిత్రాల ఆధారంగా విశ్లేషించిచూస్తే గడచిన పాతికేళ్లలో మితిమీరిన పట్టణీకరణ ఢిల్లీకి ముప్పుగా పరిణమించిన విషయం స్పష్టంగా తెలుస్తోందంటున్నారు. దీనితోపాటుగా మిగతా భౌగోళిక అంశాలుకూడా తోడవడంవల్ల ఢిల్లీకి ఇవాళ్ల ఈ పరిస్థితిని ఎదుర్కోక తప్పడంలేదని అభిప్రాయపడ్డారు.
చలికాలంలో ఉత్తర వాయువ్యం నుంచి తూర్పు తీరానికి వీస్తున్న గాలులు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న కాలుష్యాన్ని ఇబ్బడిముబ్బడిగా ఢిల్లీకి మోసుకొస్తున్నాయని అటవీ శాఖ ఉన్నతాధికారి పర్వీన్ కాస్వాన్ అభిప్రాయపడుతున్నారు. ఈ కాలంలో వాతావరణంలో వేడి బాగా తగ్గిపోతుంది. ఎంతగా వేడి తగ్గితే, ఎంతకాలంపాటు అదలా నిలిచిఉంటే అంత ఎక్కువగా కాలుష్యం ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తోందని చెబుతున్నారు. నిజానికి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నగరాలవల్ల కాలుష్యం అంతగా విస్తరించే ప్రమాదం లేదని, ఎత్తైన మైదాన ప్రాంతాల్లో ఉన్న నగరాలవల్లే కాలుష్యం మరింతగా పెరుగుతోందని తెలిపారు. చెన్నె, ముంబై నగరాల్లో మాదిరిగా సముద్రంమీదనుంచి వచ్చే గాలుల రక్షణ ఢిల్లీకి లేకపోవడంవల్లే కాలుష్యం భూతం ఇంతగా విస్తరిస్తోందని అభిప్రాయపడ్డారు. ప్రకృతి నియమాలను అనుసరిస్తే,
ప్రకృతికి అనుగుణంగా ఉంటే ఎలాంటి ముప్పూ ఉండదు. ప్రకృతికి ప్రతికూలంగా వ్యవహరిస్తే ముప్పును ఎవరూ తప్పించలేరు.
ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విపరీతమైన కాలుష్యానికి గల ప్రధాన కారణమైన సాగు వ్యర్థాలను మండించడం ఈనాడు కొత్తగా పుట్టుకొచ్చిన సమస్యకాదు. సాధారణంగా సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో పంజాబ్ లోని రైతులు వరి పొలాల్లో పంటను సేకరించిన తర్వాత మిగిలిపోయే గడ్డిని, ఇతర పంట వ్యర్థాలనూ తగలబెడతారు. పంజాబ్ ప్రిజర్వేషన్ ఆఫ్ సబ్ సాయిల్ వాటర్ యాక్ట్ 2009 ప్రకారం వరి పంటను జూన్ నెలనుంచి సేకరించాలి. దానికంటే ముందు సేకరించడానికి వీల్లేదు. దీనివల్ల రైతులు అక్టోబర్ మాసాంతంలో వ్యర్థాలను తగలబెట్టడంద్వారా తర్వాతి పంటకోసం భూమిని సిద్దం చేస్తారు. సరిగ్గా ఇదే సమయానికి వాతావరణ పరిస్థితులవల్ల ఉత్తరాదినుంచి ఢిల్లీ నగరంవైపుకు గాలులు వీయడం మొదలవుతుంది. నిజానికి పంట వ్యర్థాలను తగలబెట్టడంవల్లే పెరిగే కాలుష్యాన్ని నివారించేందుకు పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు గట్టి చర్యలే తీసుకున్నాయి. ఇలా చేస్తున్న రైతులకు భారీ స్ధాయిలో అక్కడి అధికారులు భారీ చలాన్లు విధించారు.
అయినా ఈ అలవాటును మానుకోవడానికి రైతులు ఇష్టపడడం లేదు. కారణం పంట వ్యర్థాలను మండించడంవల్ల భూమిలో ఉన్న బ్యాక్టీరియా, క్రిములు పూర్తిగా మాడి మసైపోతాయన్న నమ్మకం. కొంతవరకూ అదికూడా నిజమే అయినప్పటికీ, పెరుగుతున్న వాయుకాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాలను అవలంబించాల్సిందిగా అధికారులు రైతులకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కారణంగా మొత్తంగా నెపాన్ని ప్రభుత్వాలమీద మోపడంకూడా సరైనపని కాదన్నది నిపుణుల వాదన.పంజాబ్ లో సాగు వ్యర్థాలను తగలబెట్టడంవల్ల ఉత్పన్నమయ్యే కాలుష్యం కిందటేడాదితో పోలిస్తే 30 శాతం పెరిగిందని అంచనా.
నగరాల్లో భవన నిర్మాణానికి సంబంధించిన యంత్రాలను విరివిగా వినియోగించడంవల్లకూడా కర్బన ఉద్గారాలు పెరిగిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి వ్యవసాయంలో అధునిక యంత్రపరికరాల వినియోగం పెరిగిన తర్వాత కాలుష్యం తగ్గాలి. కానీ ఏటికేడాదికి అది పెరుగుతూనే పోవడం గమనించాల్సిన అంశం. ఈ మధ్య కాలంలో కురిసిన ఈ మాదిరి వర్షాలవల్ల ఢిల్లీలో వాయు కాలుష్యం కొద్దిగా అదుపులో ఉన్నట్టే కనిపించింది. తర్వాత కొంతకాలంపాటు గాలిలో ధూళిశాతం, కర్బన సాంద్రత శాతంకూడా కొంతవరకూ అదుపులోనే ఉన్నాయి. వ్యవసాయ దారులు సాగు భూముల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంవల్ల ఉత్పన్నమైన మితిమీరిన కాలుష్యం వేగంగా వీస్తున్న గాలుల కారణంగా ఒక్కసారిగా ఢిల్లీని చుట్టుముట్టింది.
హిమాలయాలనుండి వింధ్య సాత్పురా పర్వతాలవరకూ విస్తరించిన గంగాతీరం దాదాపు 600 కోట్లమంది భారతీయులకు ఆవాసం కావడంవల్ల ఎక్కువగా ఈ ప్రాంతంలోనే కాలుష్యం విస్తరిస్తోంది. ఈ భౌగోళిక సంబంధమైన కారణాలను పక్కనబెట్టి కేవలం వ్యవసాయ వ్యర్థాల నిర్మూలన వల్ల కలుగుతున్న నష్టాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడానికి వీల్లేదు.