దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియా పరిస్థితి ప్రస్తుతం గాలిలో దీపంలా ఉంది. ఏ రోజు ఎయిరిండియా గాల్లో కలిసిపోతుందో తెలియని పరిస్థితి. 2020 మార్చి 31 నాటికి సంస్థను ప్రైవేటీకరించకపోతే అది మూతపడటం ఖాయమని పౌర విమానయాన శాఖ మంత్రే స్వయంగా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉద్యాగాలను వదులుకుని బయటకు వెళ్లేందుకు ఉద్యోగులు సిద్ధమౌతున్నారు. అయితే రాజీనామా నిబంధనలు కఠినంగా ఉండటంతో, నోటీసు పీరియడ్ ఎక్కువగా ఉండటంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. అందుకోసం నోటీస్ పీరియడ్ నిబంధనను సడలించాలని వారు మంత్రికి ఒక బహిరంగ లేఖ వ్రాసి విన్నవించుకున్నారు.

జీతాలు ఆలస్యం కావడంతో, ఫ్లయింగ్ అలవెన్స్ అందకపోవడంతో తాము తీసుకున్న బాకీ వాయిదాలు చెల్లించడం కష్టమైపోతోందని, కాబట్టి నోటీస్ ఇవ్వకుండానే రాజీనామా చేసేందుకు అనుమతించాలని వారు కోరుతున్నారు. ఇప్పటికే మూతపడ్డ 21 ప్రైవేటు విమాన సర్వీసు కంపెనీల ఉద్యోగుల్లాగానే తామూ రోడ్డున పడదలచుకోలేదని, అందుకే మూసేసే ముందే తమకు చెల్లించాల్సిన బకాయీలను చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇండియన్ కమర్షియల్ పైలట్స్ యూనియన్ మంత్రి హర్దీప్ సింగ్ పురికి ఒక లేఖ వ్రాసింది.

తాము గత రెండున్నరేళ్లుగా అనిశ్చిత పరిస్థితుల్లో నెత్తి మీద కత్తి వేళ్లాడుతున్న పరిస్థితుల్లో బతుకుతున్నామని, ఇక ఈ అయోమయానికి తెర దించాలని వారంటున్నారు. ఇప్పటికే 65 మంది పైలట్లు రాజీనామా నోటీసులు ఇచ్చి ఆరు నెలల నోటీస్ పీరియడ్ లో పనిచేస్తున్నారని, వారికి సర్వీస్ పీరియడ్ ను తొలగించి, వారి రాజీనామాను ఆమోదించాలని యూనియన్ కోరింది. రాజీనామా చేసిన వారందరూ CAT 3 స్థాయి సీనియర్ పైలట్లు.

ఇండియన్ ఎయిర్ లైన్స్ భారీ నష్టాలను చవిచూస్తోంది. సంస్థ వద్ద ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు సైతం డబ్బుల్లేవు. కనీసం రూ. 20000 కోట్ల మేరకు ఋణం పొందితే తప్ప సంస్థను నడపడం సాధ్యం కాదు. ఈ ఋణం పొందాలంటే బ్యాంకులకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలి. కానీ ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.