బిల్లు కట్టకపోతే బిడ్డను అమ్మేయాలన్న ఆస్పత్రి సిబ్బంది.!

By సుభాష్  Published on  1 Sep 2020 10:32 AM GMT
బిల్లు కట్టకపోతే బిడ్డను అమ్మేయాలన్న ఆస్పత్రి సిబ్బంది.!

ఆస్పత్రిలో డెలివరీ అయిన ఆ మహిళ.. బిల్లు చెల్లించే స్థోమత లేకపోవడంతో ఆస్పత్రి ఓ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. బిల్లు కట్టకపోతే బిడ్డను అమ్మివేయండి అంటూ సూచించింది. ఈ ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అగ్రాలోని ఓ నిరుపేద మహిళ పురిటినొప్పులు రావడంతో డెలివరీ కోసం ఓ ఆస్పత్రిలో చేరింది. ఆమె భర్త రిక్షా తొక్కుతూ జీవనం వెళ్లదీస్తున్నాడు. బబిత అనే మహిళ ఇటీవల ఆపరేషన్‌ ద్వారా ఆస్పత్రిలో బిడ్డకు జన్మినిచ్చింది. అయితే వైద్య ఖర్చులు, మందులతో కలిపి మొత్తం రూ.35వేలు అయ్యాయంటూ ఆస్పత్రి వర్గాలు బిల్లు అందించారు.

కానీ అంత డబ్బు ఇచ్చుకోలేని పరిస్థితులో ఉన్నామని, మేము రోజు కూలీ పనులు చేసుకుంటేనే బతుకుబండి ముందుకు సాగుతుందని ఆస్పత్రి వైద్యులతో చెప్పగా, ఇంతలోనే వారికి ఊహించని పరిణామం ఎదురైంది. బిల్లు కట్టకపోతే బిడ్డను తమకు అమ్మివేయండని ఆస్పత్రి యాజమాన్యం సూచించింది. ఈ విషయాన్ని ఆ దంపతులు మీడియాకు తెలిపారు. లక్ష రూపాయలు తీసుకుని బిడ్డును వదులుకోవాలని సూచించినట్లు తెలిపారు. చివరకు వారు రోజుల వయసున్న తమ బిడ్డను వదులుకున్నారు. ఆగ్రాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ విషయంపై పూర్తి స్థాయిలోదర్యాప్తు చేపట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా మెజిస్ట్రేట్‌ స్పష్టం చేశారు.

ఆస్పత్రి బిల్లు కోసం బిడ్డను అమ్ముకున్న ఘటన తన దృష్టికి వచ్చిందని స్థానిక మున్సిపల్‌ వార్డు కౌన్సిలర్‌ హరిమోహన్‌ తెలిపారు. ఆ దంపతులు కఠిన పేదరికం అనుభవిస్తున్నారని తెలిపారు. అయితే ఆస్పత్రి వర్గాలు మాత్రం ఈ ఆరోపణలు ఖండిస్తున్నాయి. ఈ ఆరోపణలు నిజం కాదని, బిడ్డను వదులుకోవాలని మేము బలవంతం చేయలేదు.. వారే స్వయంగా బిడ్డను దత్తత ఇచ్చారు.. ఇందుకు తమ వద్ద సంతకాలు చేసినట్లు డాక్యుమెంట్లు ఉన్నాయి.. అని ఆస్పత్రి యాజమాన్యం చెబుతోంది.

Next Story