మరాఠా గడ్డపై మరోసారి ఎగిరిన కాషాయజెండా..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Oct 2019 4:20 PM GMT
మరాఠా గడ్డపై మరోసారి ఎగిరిన కాషాయజెండా..!

మరాఠా గడ్డపై మరోసారి కాషాయజెండా ఎగిరింది. వరుసగా రెండోసారి కమలదళం అధికారాన్ని సాధించింది. గతంతో పోలిస్తే సీట్లు తగ్గినా, ప్రభుత్వ ఏర్పాటు కు డోకా లేదు. ఇక, కాంగ్రెస్, ఎన్సీపీలు అనూహ్యంగా పుంజుకున్నాయి. గత అసెంబ్లీ, ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన కాంగ్రెస్, ఎన్సీపీ లు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కమలదళం దూకుడుకు చెక్ పెట్టాయి.

మహారాష్ట్రలో కమలదళం అధికారాన్ని నిలుపుకుంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 145ను కాషాయకూటమి అధిగమించింది. ఐతే, సర్వే లెక్కలు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను అందుకోవడంలో బీజేపీ-శివసేన కూటమి విఫలమైంది. మూడింట రెండు వంతుల మెజార్టీ వస్తుందని, 200కు పైగా స్థానాలు వస్తాయని లెక్క కట్టినప్పటికీ, ఆ లెక్కలు తప్పాయి. మ్యాజిక్ ఫిగర్‌ కంటే దా దాపు 10 సీట్లు మాత్రమే ఎక్కువ సాధించగలిగింది. మొత్తంగా అతికష్టమ్మీద అధికారాన్ని నిలబెట్టుకుంది.

మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలున్నాయి. తాజా ఫలితాల్లో బీజేపీ-శివసేన కూటమి 158 స్థానాలు సాధించింది. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి 98 సీట్లు కైవసం చేసుకుంది. ఇతరులు 22 స్థానాల్లో విజయం సాధించారు. పార్టీల వారీగా చూస్తే బీజేపీకి 102 సీట్లు వచ్చాయి. శివసేన 57 సీట్లలో గెలుపొందింది. ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లు కైవసం చేసుకున్నాయి. స్వతంత్రులు 13 చోట్ల పాగా వేశారు. ఎంఐఎం అనూహ్యంగా 3 సీట్లలో విజయం సాధించింది.

గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ, శివసేన బలం తగ్గిపోయింది. కాంగ్రెస్, ఎన్సీపీ బలం బాగా పెరిగింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 122 సీట్లు సాధించింది. శివ సేన 63 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్-42, ఎన్సీపీ-41 సీట్లు సాధించాయి. ఐదేళ్లు తిరిగేసరికి బీజేపీ బలం దాదాపు 20 సీట్లు కోల్పోయింది. శివసేన ఆరేడు స్థానాలు కోల్పోయింది. కాంగ్రెస్‌కు 2 సీట్లు పెరగగా, ఎన్సీపీ ఏకంగా 13 సీట్లు ఎక్కువ సాధించింది.

మొత్తంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ నాయకత్వానికి మిశ్రమ ఫలితాలు ఇచ్చాయి. అధికారం నిలబెట్టుకోవడం సంతోషకరమే ఐనప్పటికీ అంచనాలకు అనుగుణంగా సీట్లు రాకపోవడం ఇబ్బందికరమే. సొంతంగానే మెజార్టీ సాధిస్తామని, శివసేనతో కలసి మూడింట రెండు వంతుల సీట్లు కైవసం చేసు కుంటామని కాషాయకూటమి ఢంకా భజాయించింది. మోదీ మ్యాజిక్, అమిత్ షా చాణక్యం, ఫడ్నవిస్ సింప్లిసిటీ, ఠాక్రేల వారసత్వం వెరసి మరాఠా గడ్డపై విపక్ష పార్టీలకు చేదు అనుభవం తప్పదని ఊదరగొట్టారు. తీరా ఫలితాలు వెల్లడయ్యేసరికి ప్రతిపక్షాల ముఖాలు వెలిగిపోయాయి. అధికార పార్టీలో కొద్దిగా నిరుత్సాహ ఛాయలు కనిపించాయి.

Next Story