వేయండి పరుపులు.. తీయండి దుప్పట్లు.. ఆర్పండి లైట్లు.. పెట్టండి గురకలు..!
By Newsmeter.Network Published on 12 Jan 2020 8:47 AM ISTమధ్యాహ్నం లంచ్ చేయగానే కళ్లు బరువెక్కి,తల దిమ్ముగా మారి, చేతులు కాళ్లు నిస్సత్తువగా అయిపోతున్నాయా? ఒళ్లు మాట వినడం లేదా? ఎక్కడైనా కాస్త ఓ పక్కకి ఒరిగి, నిద్రపోతే బాగుండుననిపిస్తోందా? పై ఆఫీసర్ చూసి “ఆఫీసులో నిద్రేమిటోయ్” అని గద్దిస్తాడన్న భయంతో ఎలాగోలా నిద్ర ఆపుకునే ప్రయత్నం చేయాల్సి వస్తోందా? ఎవరికీ కనిపించకుండా ఏదో ఒక మూలలో ఒక పది పదిహేను నిమిషాలు పడుకుంటే భలే హాయిగా, ఉత్సాహంగా ఉందా? ఆ తరువాత పని చకచకా జరిగిపోతోందా?
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ల నుంచి ప్రభుత్వాఫీసుల దాకా మధ్యాహ్నం ఒక కునుకు తీయడంమంచిదన్న అభిప్రాయం నానాటికీ బలపడుతోంది. పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మధ్యాహ్నం పడుకుంటే చాలు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుందని, మెదడు చురుకుగా పనిచేస్తుందని శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి. ఒత్తిడి, అశాంతి దూరమౌతాయని, పని వేగం పెరుగుతుందని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. జపాన్ వంటి దేశాల్లో మధ్యాహ్నం ఒక కునుకు తీయడాన్ని ఆఫీసర్లు ప్రోత్సహిస్తారు. దీనికి వారు ఇనెమూరి అని పేరు పెట్టారు. దీని అర్థం నిద్రపోతూ మెలకువగా ఉండటం.
అమెరికాలో చాలా కంపెనీలు ఉద్యోగులు నిద్రపోయేందుకు వీలుగా “నాపింగ్ చెయిర్స్” కూడా ఏర్పాటు చేస్తున్నాయి. మరి కొన్ని సంస్థలు ఎనర్జీ పాడ్స్ అనే ప్రత్యేక మంచాలు తెప్పించి, ఉద్యోగుల కోసం ఏర్పాటు చేస్తున్నాయి. మ్యూజిక్, లేపాల్సి వచ్చినప్పుడు మృదుస్పర్శతో లేపే పరికరాలు కూడా అమరుస్తున్నాయి. పలు సంస్థలు మధ్యాహ్న నిద్ర వ్యవస్థలను రీచార్జి సెంటర్లుగా పిలుస్తున్నాయి. మధ్యాహ్న నిద్ర లేమి వల్ల అమెరికాలో 1.2 మిలియన్ పనిదినాలు వృథాగా పోతున్నాయని, దీని వలన అమెరికన్ వాణిజ్య రంగానికి ఏటా 411 మిలియన్ డాలర్ల నష్టం జరుగుతోందని అధ్యయనాల్లో తేలింది. అందుకే నాసా, గూగుల్, హఫింగ్ టన్ పోస్ట్, ఫేస్ బుక్, జాపో, సాంసంగ్, ఉబర్, ప్రాక్టర్ అండ్ గేంబుల్, వర్జీనియా టెక్, యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా, యూనివర్సిటీ ఆఫ్ మయామీ వంటి సంస్థలు మధ్యాహ్న నిద్రను ప్రోత్సహిస్తున్నాయి.
ఇక మనదేశంలోనూ ఒక మాట్రెస్ కంపెనీ 2019 లో ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. దీని ప్రకారం 80 శాతం మంది తమ తమ ఆఫీసుల్లో మధ్యాహ్నం మేను వాల్చడానికి ఏదో ఒక ఏర్పాటు ఉండటం మంచిదని భావిస్తున్నారని తేలింది. ఇంకేం మరి.... వేయండి పరుపులు... తీయండి దుప్పట్లు... ఆర్పండి లైట్లు... పెట్టండి గురకలు....!!!