తల్లి మరణం.. కాలినడకన 650 కి.మీ..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 March 2020 1:49 PM GMT
తల్లి మరణం.. కాలినడకన 650 కి.మీ..

క‌రోనా వైర‌స్ వ్యాప్తి అరిక‌ట్ట‌డానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. లాక్‌డౌన్ స‌త్ఫ‌లితాలిస్తున్న‌ప‌ట్టికీ కొంద‌రికీ మాత్రం చేదు అనుభ‌వాల‌ని మిగులుస్తోంది. తాజాగా కంట తడి పెట్టించే ఇలాంటి ఓ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని వార‌ణాసికి చెందిన ముర‌కీం అనే ఓ 25 ఏళ్ల యువ‌కుడు రాయ్‌పూర్‌లో ప‌ని చేస్తున్నాడు. ఈ నెల 25న త‌ల్లి మ‌ర‌ణించింద‌నే వార్త తెలిసింది. అప్ప‌టికే దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌లులో ఉంది. ర‌వాణా వ్య‌వ‌స్థ స్తంభించిపోయి ఉండ‌డంతో ఎలా వెళ్లాడో అర్థం కాలేదు. దీంతో రాయ్‌పూర్ నుంచి స్వ‌స్థ‌లం వార‌ణాసికి కాలిన‌డ‌క‌న వెళ్ల‌డానికి సిద్ద‌మ‌య్యాడు. అయితే.. రాయ్‌పూర్‌ నుంచి వారణాసికి సుమారు 654 కిలో మీటర్ల దూరం ఉంది. అయినా, వెరవకుండా తన ఇద్దరు స్నేహితులతో కలిసి రాయ్‌పూర్ నుంచి వారణాసికి బయలుదేరాడు.

వారు వెళ్లే దారిలో అక్క‌డ‌క్క‌డ రోడ్డు పై వెళ్లే వాహానాల‌ను ఆపి లిఫ్ట్ అడుగుతూ ముందుకు సాగుతున్నారు.ఇలా మూడు రోజుల్లో 350కిమీ ప్ర‌యాణించి బైకుంఠ‌పూర్‌కు చేరుకున్నారు. మార్గ‌మ‌ధ్యంలో వీరిని మీడియా ప‌ల‌క‌రించ‌గ‌డా ఈ విష‌యాల‌ను వెల్ల‌డించారు. ఇప్ప‌టికే స‌గం దూరం చేరుకున్నామ‌ని.. ఇలాగే న‌డుస్తూ త‌మ స్వ‌స్థ‌లానికి చేరుకుంటామ‌ని తెలిపారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా ఫ్యాక్ట‌రీలు, కార్యాల‌యాల‌తో పాటు దుకాణాలు మూత‌ప‌డ్డాయి. దీంతో వీటిలో ప‌నిచేసే ప‌లువురు కార్మికులు, కూలీలు కాలిన‌డ‌క‌న త‌మ సొంత ఊళ్ల‌కు ప‌య‌న‌మ‌య్యారు. అధికారులు ఎక్క‌డి ప్ర‌జ‌జ‌లు అక్క‌డే ఉండాల‌ని సూచిస్తున్న‌ప్ప‌టికి వీరు ప్ర‌యాణాలు మాత్రం కొన‌సాగిస్తున్నారు.

Next Story