ఇక ఐదు నిమిషాల్లోనే కరోనా నిర్ధారణ పరీక్ష..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 March 2020 7:14 AM GMT
ఇక ఐదు నిమిషాల్లోనే కరోనా నిర్ధారణ పరీక్ష..

క‌రోనా వైరస్‌(కొవిడ్‌-19) ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి బారీన ప‌డి ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్ప‌టికే 25వేల మందికి పైగా మృత్యువాత ప‌డ‌గా.. ఐదు ల‌క్ష‌ల మంది క‌రోనా పాజిటివ్‌తో ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి ఇప్ప‌టికే చాలా దేశాలు లాక్‌డౌన్ ప్ర‌క‌టించాయి. అయిన‌ప్ప‌టికి ఈ మ‌హ‌మ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది.

ఇదిలా ఉంటే.. కేవలం ఐదు నిమిషాల్లో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు పూర్తిచేసే పరికరాన్ని అభివృద్ధిచేసినట్టు అమెరికాకు చెందిన ఓ సంస్థ శుక్రవారం ప్రకటించింది. అబోట్ ల్యాబొరేటరీస్ రూపొందించిన ఈ పరికరానికి అత్యవసర ప్రక్రియ కింద అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అనుమతించింది. వచ్చేవారమే ఈ కిట్ వైద్య సిబ్బందికి అందుబాటులోకి రానుందని అబోట్ తెలిపింది. చిన్నపాటి టోస్టర్ పరిమాణంలో ఉండే మాలిక్యులర్ టెక్నాలజీ పరికరం.. వ్యక్తి నమూనాలను పరీక్షించి.. కరోనా వైరస్ ఉంటే ఫలితం ఐదు నిమిషాల్లోనే వెల్లడిస్తుంది. అంతేకాదు, నెగెటివ్ ఉంటే 13 నిమిషాల్లో ఫలితాన్ని తెలియజేస్తుందని అబోట్ ల్యాబొరేటరీస్ పేర్కొంది.

ఈ సందర్భంగా అబాట్‌ అధ్యక్షుడు, సీఓఓ రాబర్ట్‌ ఫోర్డ్‌ మాట్లాడుతూ.. ‘ కోవిడ్‌-19 మహమ్మారిపై అన్ని వైపుల నుంచి పోరాటం చేస్తున్నాం. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనే యుద్ధంలో ఈ పోర్టబుల్‌ మాలిక్యులర్‌ టెస్టు ఎంతగానో ఉపకరిస్తుంది. వైరస్‌పై పోరాడేందుకు ముఖ్యమైన నిర్ధారణ పరీక్షల్లో త్వరితగతిన ఫలితాలు వెల్లడిస్తుంది’’అని పేర్కొన్నారు. కేవలం ఆస్పత్రులకే పరిమితం కాకుండా ఎక్కడైనా దీనిని తీసుకువెళ్లేందుకు వీలుగా టోస్టర్‌ సైజులో రూపొందించినట్లు వెల్లడించారు. అయితే ఈ కిట్‌ను ప్రజా బాహుళ్యంలోకి తెచ్చేందుకు ఎఫ్‌డీఏ నుంచి ఆమోదం లభించలేదని తెలిపారు. ఇక కరోనా వైరస్‌ను 50 నిమిషాల్లో నిర్ధారించే స్మార్ట్‌ఫోన్‌ ఆధారిత పోర్టబుల్‌ కిట్‌ను రూపొందించినట్లు బ్రిటన్‌ పరిశోధకులు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దక్షిణ కొరియాలోనూ ఏడు నిమిషాల్లోనే కోవిడ్-19 పరీక్ష నిర్వహించే కిట్ తయారు చేశారు. కొరియాలో తొలి కరోనా కేసును జనవరిలో గుర్తించారు. కానీ ఆ కేసు బయటపడక ముందే వుహాన్‌లో కరోనా విజృంభిస్తున్న తీరును గమనించే కొరియా కంపెనీలు టెస్టు కిట్లను డెవలప్ చేయడం మొదలుపెట్టాయి. కొరియాలో కరోనా పేట్రేగే సమయానికి రోజుకు పది వేల మందికిపైగా పరీక్షలు చేసే స్థాయికి ఆ దేశం చేరుకుంది.



Next Story