ఆహారం లేక బక్కచిక్కిన సింహాలు
By రాణి Published on 23 Jan 2020 11:48 AM ISTAfrica Lions
ఉత్తరాఫ్రికాలోని సూడాన్ దేశంలో ఉన్న ఖార్జూమ్ ఆల్ ఖురేషీ జూ లో సింహాలకు సరైన ఆహారం లేక ఆకలితో అలమటించి పోతున్నాయి. రౌద్రంగా గర్జించాల్సిన సింహాలు ఇలా గ్రామ సింహాల్లా బక్కచిక్కిపోతుంటే...చూసేవారికి చాలా జాలి కలుగుతుంది వాటిమీద. ఎంత అవి క్రూరమృగాలైనప్పటికీ జూ కి వచ్చేవారి కంట నీరుతెప్పిస్తున్నాయి. సూడాన్ లో జరుగుతున్న అంతర్యుద్ధం లక్షలలాదిమంది పాలిట శాపంగా మారింది. అక్కడున్న మనుషులే తమ కడుపులు నింపుకోవడానికి పడరాని పాట్లు పడుతుందో...ఇక నోరు లేని జీవాలు తమ ఆకలిని తీర్చమని ఎవరిని అడుగుతాయి చెప్పండి.
ఆ సింహాలను చూస్తుంటే జాలేస్తోందని, వాటి దీన గాధను వర్ణించేందుకు మాటలు కూడా రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆ జూ నిర్వాహకులు. గాంభీర్యంగా ఉండాల్సిన మృగరాజులు ఎముకల గూడును తలపించేలా కనిపిస్తున్నాయన్నారు. సరైన ఆహారం లేక అవి ఆకలితో అలమటిస్తున్నాయని, జూ లో ఉన్న సింహాలు సగానికి పైగా బరువు తగ్గినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రస్తుతం సింహాలకు తమ సొంత డబ్బు ఖర్చు చేసి ఆహారాన్ని అందిస్తున్నామని, తమ జూ కి ఎవరూ సహాయం అందించడం లేదని తెలిపారు. సింహాలు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాయని, దీనికి తోడు పోషకాహార లోపం ఉన్నట్లు కనిపిస్తోందని మోటాజ్ మహమూద్ అనే కేర్ టేకర్ వ్యాఖ్యానించారు.
ఆ సింహాల పరిస్థితిని చూసి చలించిపోయిన ఉస్మాన్ సలీహ్ అనే జంతు ప్రేమికుడు వాటికి తన వంతు సహాయం అందించాలని తలిచి వాటిని ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆకలితో అలమటించి బక్కచిక్కిపోయిన సఫారీలకు చేతనైన సహాయం చేయాలని అతను నెటిజన్లు కోరాడు. సలీహ్ చేసిన ఈ ప్రయత్నం కొద్దికొద్దిగా ఫలితాలనిస్తోంది. నెటిజన్లు అతను చేసిన దానికి అభినందించారు. చాలామంది ఆ పార్కును సందర్శించి సింహాలకు ఆహారం, మందులు ఇలా తమ వంతుగా తమకు తోచిన సహాయాన్ని చేశారు. ఎప్పటికప్పుడు సింహాల ఆరోగ్యంపై తమకు సమాచారం ఇవ్వాల్సిందిగా కూడా వారు కోరారట.