మాజీ ప్రియుడిని హత్య చేసిన 'నటి'
By సుభాష్ Published on 31 Dec 2019 4:29 PM IST
వివాహేత సంబంధం కొనసాగించాలంటూ ఒత్తిడి తీసుకువచ్చినందుకు ఓ బుల్లితెర నటి తన మాజీ ప్రియుడిని దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం సృష్టించింది. తమిళనాడులో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. హత్య చేసిన నటితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. దేవి అనే బుల్లితెర నటి తన భర్త శంకర్‌తో కలిసి చాలా రోజులుగా వడపళనిలో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో మధురైకి చెందిన రవి అనే వ్యక్తి పదేళ్ల కిందట సినిమాల్లో నటించాలని ఎంతో ఆసక్తితో చెన్నైకి వచ్చాడు. సాలిగ్రామంలో నివసిస్తున్న రవికి దేవితో పరిచయం ఏర్పడింది. కొంత కాలానికి అది వివాహేతర సంబంధానికి దారి తీసింది.
కాగా, ఇటీవల ఆమె ప్రియుడిని వదిలించుకోవాలని చెప్పకుండా కొలత్తూరు సెమిత్తమన్ కోవిలో గల్లీకి మారిపోయింది. ఇక నటిగా కూడా అవకాశాలు తగ్గిపోవడంతో చేసేదేమి లేక టైలరింగ్ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. ఇక దేవి కనిపించకపోవడంతో రవి ఆమెకోసం వెతకడం మొదలు పెట్టాడు. చివరికి దేవి చెల్లెలు లక్ష్మీ ఇంటి చిరునామా తెలిసింది. దీంతో ఆదివారం రాత్రి ఫుల్లుగా మద్యం కొట్టి ప్రియురాలి ఇంటికి వెళ్లిన రవి, ఆమెతో ఘర్షణకు దిగాడు. ఈ విషయం తెలుసుకున్న దేవి భర్త శంకర్‌తో కలిసి లక్ష్మీ ఇంటికి చేరుకున్నారు. ఘర్షణ పడుతున్న రవిని వెళ్లిపోవాలని వారు సూచించారు. అయినా రవి వినకపోవడంతో దేవి ఇనుపరాడ్‌తో రవిని కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న కొలట్లూరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని రవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక హత్యకు పాల్పడిన దేవి, ఆమె భర్త శంకర్, చెల్లెలు లక్ష్మీ, ఆమె భర్త సావరీస్‌లను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.