ముఖ్యాంశాలు

  • ప్రధాని మోదీకి 170 మంది మహిళా ప్రముఖుల లేఖ
  • రేప్‌ను ప్రచారస్త్రంగా వాడుకుంటున్నారని ఆందోళన
  • ఎన్నికల్లో హుందాగా పోరాడాలి: మహిళా ప్రముఖులు

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు హోరెత్తిస్తున్నాయి. ఆప్‌, బీజేపీలు పోటా పోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. అయితే ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు రేప్‌ను ఓ ప్రచార అస్త్రంగా వాడుకుంటున్నారని 170 మంది మహిళా ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రచారంలో బీజేపీ నేతలు విద్వేషపూరితంగా మాట్లాడుతున్నారని పలు మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. తమకే ఓటేయాలని.. లేదంటే అత్యాచారాలు జరిగిపోతాయంటూ హెచ్చరికల చేస్తున్నారని మహిళలు ప్రముఖులు పేర్కొన్నారు. ఢిల్లీ మహిళలకు మీరు చేసే హెచ్చరిక ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.

లైంగిక దాడుల పేరుతో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు. దీని పట్ల ప్రధాని నరేంద్ర మోదీ మౌనం.. పరోక్షంగా ప్రోత్సహించినట్లు ఉందని మహిళలు విమర్శిస్తున్నారు. ఆర్థికవేత్త దేవకి జైన్‌, హక్కుల కార్యకర్తలు లైలా తయాబ్జీ, కమలా భాసిన్‌, మధు బాధురితో పాటు పలువురు ప్రముఖులు, ఏఐపీడబ్ల్యూఏ, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ వంటి సంస్థలు.. ఈ మేరకు సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాయి. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు సృష్టిస్తున్న భయాన్ని చూసి కలత చెంది ఈ లేఖ రాస్తున్నామని మహిళా ప్రముఖులు పేర్కొన్నారు.

సీఏఏ, ఎన్‌ఆర్సీ, ఎన్పీఆర్‌లకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న మహిళలపై దాడులకు పాల్పడాలంటూ బీజేపీ నేతల తమ కార్యకర్తలకు పిలుపునిస్తున్నారని అన్నారు. మహిళలపై రేప్‌లు జరుగుతాయని బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారని.. దీనిపై మోదీ మాట్లాడకుండా వారిని ప్రోత్సహిస్తున్నారని మహిళా ప్రముఖులు తమ లేఖలో పేర్కొన్నారు. దీంతో అన్ని వర్గాల మహిళలు అభద్రతాభావానికి గురవుతున్నారని పేర్కొన్నారు. షాహీన్‌బాగ్‌లో ఇండ్లలోకి చొరబడి మహిళలపై హత్యాచారాలు చేసే అవకాశాలున్నాయని బీజేపీ ఎంపీ పర్వేశ్‌ వర్మ చేసిన వ్యాఖ్యలు ఈ లేఖలో ప్రస్తావించారు. ఇదేనా ఢిల్లీ మహిళలకు అందించాలనుకుంటున్నది అంటూ మోదీని ప్రశ్నించారు. బీజేపీ చేస్తున్న ఈ విషప్రచారాలను దేశ ప్రజలు ఎప్పటికి మర్చిపోరన్నారు.

శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై కేంద్ర ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పుతున్నదని, ఓ సభలో కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ దేశ ద్రోహులను కాల్చిపారేయండి అంటూ చేసిన వ్యాఖ్యలో లేఖలో పేర్కొన్నారు. చెప్తే మాటవినని వారికి బుల్లెట్లతో అర్థమయ్యేలా చెప్పాలని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వ్యాఖ్యలు, కొందరు ఎంపీలు సామాన్య ప్రజలను బెదిరిస్తున్నారని తెలిపారు. అయితే పోలీసులు మాత్రం చూస్తూ ఉండిపోతున్నారని.. దీంతో తాము తీవ్ర భయాందోళనకు గురవుతున్నామని లేఖలో పేర్కొన్నారు.

ఎన్‌ఆర్సీకి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలను కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవచ్చని. అయితే తాము రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారానే శాంతియుత నిరసన తెలియజేస్తున్నామని తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం మహిళలు ఉద్యమిస్తుంటే.. వారిపై దేశద్రోహ కేసులు పెడుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ తక్షణ స్పందిచాలన్నారు. ఎన్నికల్లో హుందాగా పోరాడాలని మహిళా ప్రముఖులు కోరారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.