ఏసీబీ ముందు నోరు విప్పని అవినీతి ఏసీపీ
By సుభాష్ Published on 7 Oct 2020 10:08 AM GMTఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డి కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. నాలుగు రోజుల కస్టడీలో భాగంగా మూడో రోజు నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో నరసింహారెడ్డిని అధికారులు ప్రశ్నించారు. అతని బినామీ ఆస్తులపై ఆరా తీశారు. పెద్ద అంబర్‌పేటలో ఓ హోటల్‌ను నరసింహారెడ్డి బినామీ నిర్వహిస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇంకా ఎక్కడెక్కడ ఆస్తులను కూడబెట్టారనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు. కాగా, ఇప్పటికే అనంతపురంలో 55 ఎకరాల పొలం, మాదాపూర్‌లోని సర్వే నంబర్ 64లో 1,960 గజాల స్థలంతోపాటు పలు చోట్ల ఇళ్లు, స్థలాలు ఉన్నట్లు గుర్తించారు.
నోరు విప్పని నర్సింహారెడ్డి
కాగా, అక్రమంగా కోట్లకొద్ది ఆస్తులు కూడబెట్టుకున్న నర్సింహారెడ్డి ఏసీబీ అధికారుల ముందు నోరు విప్పడం లేదని తెలుస్తోంది. దర్యాప్తులో తన బినామీ ఆస్తుల గురించి నోరు విప్పకపోవడంతో ఆధారాలను అతని ముందుంచి ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నాలుగు రోజుల కస్టడీలో భాగంగా నరసింహారెడ్డిని అధికారులు ఇప్పటికే రెండు రజుల పాటు ప్రశ్నించినా పెద్దగా వివరాలు వెల్లడించలేదని సమాచారం.