మహిళా ముఖ్యమంత్రి రాజ్యంలోనే మాగ్జిమమ్ యాసిడ్ దాడులు..!

By Newsmeter.Network  Published on  12 Jan 2020 3:30 AM GMT
మహిళా ముఖ్యమంత్రి రాజ్యంలోనే మాగ్జిమమ్ యాసిడ్ దాడులు..!

దీపికా పాదుకోన్ నటించిన చపాక్ సినిమా మరోసారి యాసిడ్ దాడి బాధితుల విషాదగాథలను తెరమీదకి తెచ్చింది. దేశమంతటా వేలాది మంది నిర్భాగ్యులు యాసిడ్ దాడుల వల్ల జీవితాంతం నరకయాతన అనుభవిస్తున్నారు. 2018 లోనూ 218 యాసిడ్ దాడులు జరిగాయి. అంతకు ముందు సంవత్సరం అంటే 2017 లో 244 యాసిడ్ దాడులు జరిగాయి. దానితో పోలిస్తే కొద్దిగా యాసిడ్ దాడులు తగ్గినట్టు బావించవచ్చు. అయితే ఎక్కువ శాతం దాడులు మహిళల మీదే జరుగుతున్నాయి.

విషాదం ఏమిటంటే మహిళా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏలుబడిలో ఉన్న పశ్చిమ బెంగాల్ లోనే అత్యధికంగా యాసిడ్ దాడులు జరుగుతున్నాయి. 2018 లో పశ్చిమ బెంగాల్ లో 50 యాసిడ్ దాడి సంఘటనలు జరిగాయి. ఇందులో 53 మంది గాయాలపాలయ్యారు. మొత్తం దాడుల్లో 131 దాడులు మహిళలపైనే జరిగాయి.

గత అయిదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే యాసిడ్ దాడుల విషయంలో పశ్చిమ బెంగాల్ తొలి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది. ఇక కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీదే అగ్రస్థానం. నిజానికి యాసిడ్ ను బజార్ లో బహిరంగంగా అమ్మడం, కొనుగోలు పై ఎలాంటి నిషేధాలూ లేకపోవడం, కొనుగోలు చేసే వ్యక్తుల వివరాలు అందుబాటులో లేకపోవడం వల్ల దుండగులకు చాలా సులువుగా యాసిడ్ అందుబాటులోకి వస్తోంది. పోలీసులు కూడా యాసిడ్ అమ్మకాలు, కొనుగోళ్లపై ఎలాంటి నిఘా ఉంచలేకపోతున్నారు.

యాసిడ్ దాడి కేసులను భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 326 ఏ కింద విచారించడం జరుగుతుంది. ఇందులో దోషిగా ఋజువైతే అత్యధికంగా పదేళ్ల జైలుశిక్ష పడుతుంది. శిక్షను మరింత కఠినతరం చేయాల్సి ఉందని సామాజిక కార్యకర్తలు అంటున్నారు. అదే విధంగా యాసిడ్ అమ్మకాల విషయంలో సుప్రీం కోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ప్రకటించినా అవి అమలుకు నోచుకోవడం లేదని వారు ఆక్షేపిస్తున్నారు. గతేడాది యాసిడ్ దాడి కేసుల్లో 28 మందికి శిక్ష పడింది. నేరస్తులందరూ పురుషులే కావడం విశేషం. 2017లో 20 మందికి శిక్షపడింది. అందులో 15 మంది పురుషులు, అయిదుగురు స్త్రీలు.

Next Story