నాణ్యత ప్రమాణాల పెంపే లక్ష్యం.. న్యాక్ తరహాలోనే అథారిటీ..!
By అంజి Published on 3 Feb 2020 5:30 AM GMT
హైదరాబాద్: పాఠశాల విద్యలోనూ అక్రెడిటేషన్ విధానం రాబోతోంది. కాలేజీలకు నేషనల్ అసెన్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) ఇచ్చే గుర్తింపు తరహాలోనే పాఠశాలలకు సైతం గుర్తింపు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పాఠశాలల్లో నాణ్యత ప్రమాణాల పెంపే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలోనే అక్రెడిటేషన్ సంస్థనే ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. నూతన విద్యా విధానంలో భాగంగా ఈ విధానాన్ని కేంద్రం అమల్లోకి తీసుకురానుంది. న్యాక్ తరహాలోనే రాష్ట్ర స్థాయిలో స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీని ఏర్పాటు చేయనున్నారు. నూతన విద్యా విధానంపై ఏర్పాటైన కస్తూరి రంగన్ కమిటీ ఈ అంశాన్ని ప్రతిపాదించింది.
కొత్త పాఠశాలలకు కూడా ఎస్‌ఎస్‌ఎస్‌ఏ నుంచే లైసెన్స్ ఇచ్చే విధానం తెవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కాగా చాలా ప్రైవేట్ స్కూళ్లు.. విద్యను ఆర్థిక వనరుగానే చూస్తున్నాయని, స్కూళ్లను వ్యాపార రంగంగా మార్చేశాయని కస్తూరి రంగన్ కమిటీ తెలిపింది. పాఠశాలల నిర్వహణ, ప్రమాణాల పెంపు కార్యక్రమాలన్నీ జిల్లాలోని డీఈవోలు ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి. దీంతో అధికారం కేంద్రీకృతం కావడం వల్ల.. పాఠశాలల నిర్వహణ విధానం దెబ్బతింటుండగా, నాణ్యమైన విద్యను అందించడం సాధ్యం కావడం లేదని కస్తూరి రంగన్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. విద్యా సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు పారదర్శక విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో నూతన విద్యా విధానంలో పలు చర్యలు చేపట్టాలని కమిటీ సూచించింది.
పాఠశాల విద్యలో నాలుగు అంశాలే కీలకమని పేర్కొన్న కస్తూరిరంగన్ కమిటీ.. ఇందుకు అధికార వికేంద్రీకరణ చేపట్టాలని వెల్లడించింది. పాలసీ మేకింగ్, ఆపరేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, వృత్తి నైపుణ్యాల పెంపుతో పాటు స్వయం ప్రతిపత్తిగల సంస్థతో అకడమిక్ వ్యవహరాల నిర్వహణ చేపట్టాలని తెలిపింది. విద్యా ప్రమాణాల పెంపు వ్యవహారాలను అత్యున్నత విభాగంగా పాఠశాల విద్యాశాఖే పర్యవేక్షించాలి. పాఠశాలల్లో విధానాలు, పథకాల అమలును పాఠశాల విద్యా డైరెక్టరేట్ చూడాలి. అక్రెడిటేషన్ విధానాన్ని అమల్లోకి తేచ్చేందుకు విద్యాహక్కు చట్టం-2009ని సమీక్షించాలని కమిటీ పేర్కొంది.