ఏసీబీకి చిక్కిన బాన్సువాడ రూరల్ సీఐ
By సుభాష్ Published on 13 Oct 2020 5:15 AM GMTలంచాలు తీసుకుంటు ఎంతో మంది ఏసీబీకి అడ్డంగా దొరికిపోతున్నా మరి కొందరి ఉద్యోగుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. ఒక వైపు రాష్ట్రంలో లంచాలు అనేవి ఉండకూడదని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా.. కొందరు పెడచెవిన పెట్టి అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా లంచం తీసుకుంటూ కామారెడ్డి జిల్లా బాన్సువాడ రూరల్ సీఐ టాటా బాబు సోమవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. మెదక్ ఏసీబీ డీఎస్పీ రవికుమార్ వివరాల ప్రకారం.. నసురుల్లాబాద్‌కు చెందిన శివప్రసాద్, బాన్సువాడకు చెందిన ప్రతాప్‌సింగ్‌ల మధ్య కాంట్రాక్టులకు సంబంధించి తగాదాలున్నాయి. ఈ విషయమై నసురుల్లాబాద్ పోలీసు స్టేషన్‌లో ఆగస్టు 21న కేసు నమోదైంది. తనను అరెస్టు చేయకుండా ఉండడానికి బాన్సువాడకు చెందిన ఓ పార్టీ నాయకుడి ద్వారా ప్రతాప్‌సింగ్ రూరల్ సీఐ టాటా బాబును కలిశారు.
దీని కోసం రూరల్ సీఐ రూ.50వేలు డిమాండ్ చేయగా, చివరకు రూ.20వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అక్టోబర్ 10న పదివేలు ఇవ్వగా, మిగతా పదివేలు సోమవారం బాన్సువాడలోని తన నివాసంలో సీఐ లంచం తీసుకోగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకుని సీఐని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ఘటన సంచలనంగా మారింది.
ఇలాంటి వారి అత్యాశ వల్ల పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు వస్తోంది. ఇటీవల ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డి అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ వ్యవహారం రాష్ట్రంలో పెద్ద దుమారం రేపుతోంది. అధికారులు విచారించే కొద్ది బినామీ పేర్లు బయటకు వస్తున్నాయి. కోట్లల్లో ఆస్తులు సొమ్ము చేసుకుంటున్నారు. తెలంగాణలో లంచాల వ్యవహారం రోజురోజుకు పెరుగుతుండటంతో ఏసీబీ అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు. లంచాలకు పాల్పడుతూ అధికారులకు అడ్డంగా దొరికిపోయినా.. కొందురు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి లంచాల కారణంగానే తెలంగాణ ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థనే రద్దు చేసి రెవెన్యూ వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చింది. అలాంటి లంచాలు తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.