రూ. కోటి 12 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్
By సుభాష్ Published on 9 Sept 2020 11:51 AM IST
ఏసీబీ వలలో భారీ తిమింగలాలు దొరికిపోతున్నాయి. మొన్న కీసర మాజీ తహసీల్దార్.. నేడు మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్. తెలంగాణ రాష్ట్రంలో లంచాలు తీసుకోవడంతో వీరు సంచలనం సృష్టిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో మరో భారీ అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది.
తాజాగా మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ భారీ ఎత్తున లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఓ వివాదంలో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయడానికి కోటి 12 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడిన ఘటన సంచలనం సృష్టించింది. వివాదంతో ఉన్న భూమి విషయంలో భారీగా లంచం తీసుకునేందుకు సిద్ధపడ్డాడు. లంచం డబ్బులు ఇవ్వడేమోననే అనుమానంతో లంచం ఇచ్చే వ్యక్తితో నగేష్ ఒప్పందం పత్రం కూడా రాయించుకున్నట్లు ఏసీబీ విచారణ తేలింది.
బుధవారం ఉదయం నుంచి మాచవరంలో నగేష్ ఇంట్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ రావు ఆధ్వర్యంలో సిబ్బంది అడిషనల్ కలెక్టర్ ఇంట్లో తనిఖీలు చేపడుతున్నారు. అంతేకాకుండా హైదరాబాద్‌లోని ఆయన ఆస్తులపై కూడా సోదాలు కొనసాగుతున్నాయి. వివాదంలో ఉన్న భూమికి సంబంధిత పత్రాలు కూడా ఏసీబీ అధికారులకు లభ్యమైనట్లు సమాచారం. కాగా, నగేష్ ఇంట్లో బుధవారం సాయంత్రం వరకు సోదాలు జరిగే అవకాశం ఉంది. సోదాల తర్వాత నగేష్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉంది. మొత్తం మూడు చోట్ల ఈ ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి.
కాగా, నర్సాపూర్ డివిజన్‌లోని తిప్పల్ తుర్తి గ్రామంలో 112 ఎకరాల భూమికి సంబంధించి ఎన్‌వోసీ కోసం ఏకంగా కోటి 40 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ భూ వివాదం పరిష్కారంలో రూ. కోటి 12 లక్షలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. అంతేకాదు.. ఆడియో క్లిప్‌లతో సహా దొరిపోవడంతో అడిషనల్ కలెక్టర్ నగేష్ గారి మైండ్ బ్లాక్ అయిపోయినంత పనైంది. లంచంగా కోటి 12 లక్షలు, కోటి రూపాయల ప్రాపర్టీ కూడా నగేష్ రాయించుకున్నట్లు సమాచారం. మరో వైపు నగేష్ వ్యవహారంతో ఏకకాలంలో 12 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు.
ఈ కేసులో అడిషనల్ కలెక్టర్‌తో పాటు రెవెన్యూ సిబ్బంది పాత్రపై కూడా ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే నగేష్ భార్యను విచారణ నిమిత్తం బోయిన్‌పల్లికి తరలించినట్లు సమాచారం.