తొలి మ్యాచ్‌కు ముందే ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్
By తోట వంశీ కుమార్ Published on 20 Sept 2020 5:40 PM ISTక్రికెట్ ప్రేమికులందరూ ఎంతగానో ఎదరుచూస్తున్న ఐపీఎల్ నిన్న ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ తలపడగా.. ధోని సేన విజయాన్ని అందుకుంది. ఆదివారం రెండో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్‌ఎలెవన్ పంజాబ్‌లు తలపడనున్నాయి. కాగా.. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడలేదు. దీంతో ఎలాగైనా ఈ సారి కప్ కొట్టాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి.
పంజాబ్ ఈసారి కొత్త కెప్టెన్ కేఎల్ రాహుల్ నాయకత్వంలో బరిలోకి దిగుతోండగా.. నిరుడు శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో మెరుగైన ప్రదర్శన చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లోనూ సత్తా చాటాలని ఊవ్విళ్లూరుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీని ఘనంగా ఆరంభించాలని రెండు జట్లు బావిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌కు ముందే ఢిల్లీకి భారీ షాక్ తగిలింది.
ఆజట్టులో కీలక ఆటగాడు, స్టార్ పేసర్ ఇషాంత్ శర్మ ప్రాక్టీస్‌లో బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో అతడు తొలి మ్యాచ్‌లో ఆడేది అనుమానంగా మారింది. బ్యాటింగ్‌లో ఢిల్లీకి ఎలాంటి సమస్యలు లేనప్పటికి బౌలింగ్‌లో అనుభవజ్ఞుడైన ఇషాంత్ దూరమైన ఢిల్లీ బౌలింగ్ బలహీనపడే అవకాశం ఉంది. అతని స్థానంలో అన్రిచ్ నోర్జ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
ఐపీఎల్ 2019 సీజన్‌లో రెండు మ్యాచ్‌ల్లో తలపడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్.. చెరో మ్యాచ్‌లో గెలుపొందాయి. ఐపీఎల్ లీగ్‌లో 24 సార్లు ఇరు జట్లు తలపడగా.. 10 మ్యాచుల్లో ఢిల్లీ, 14 మ్యాచుల్లో పంజాబ్ గెలిచాయి. మొత్తంగా ఢిల్లీపై పంజాబ్ ఆధిపత్యం వహించింది.
రహానే ఉండటం అనుమానమే : పాంటింగ్
ఢిల్లీ తుది జట్టులో రహానేకు చోటు దక్కడం కష్టమేనని అంటున్నాడు కోచ్ రికీ పాంటింగ్. రహానేను తుది జట్టులోకి తీసుకోవడం పై మిశ్రమ ఆలోచనలు ఉన్నాయని.. అందువల్ల టాస్ ముందు పిచ్‌ను పరిశీలించన తరువాతనే తన స్థానం పై తుదినిర్ణయం తీసుకుంటామన్నాడు. ఐపీఎల్‌లో గత సీజన్లలో రెగ్యులర్ ఓపెనర్‌గా ఉన్న అజింక్య రహానేను రాజస్థాన్ రాయల్స్ నుండి ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో ఢిల్లీ తీసుకుంది. కానీ ఢిల్లీ జట్టులో ఇప్పటికే పృథ్వీ షా మరియు శిఖర్ ధావన్ రూపంలో అద్భుతమైన ఓపెనర్లు ఉన్నారు. వీరి కాంబినేషన్‌ను మార్చేందుకు ఢిల్లీ ఇష్టపడడం లేదు. అయితే, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌లతో పాటు మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేయడానికి అతన్ని ఉపయోగించవచ్చు అని పాంటింగ్ చెప్పాడు. చూడాలి మరి రహానే.. ఈ రోజు ఢిల్లీ తుది జట్టులో ఉంటాడా... లేదా అనేది.