ఐపీఎల్ యుఏఈ లో జరిగితే ఆర్సీబీకి బాగా కలిసొస్తుందట..!
By తోట వంశీ కుమార్ Published on 23 July 2020 8:32 PM ISTఐపీఎల్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న జట్లలో 'రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు' ఒకటి..! కానీ కప్ మాత్రం ఇప్పటి వరకూ అందుకోలేదు. తనదైన రోజున ఏ జట్టునైనా ఓడించగలిగే సత్తా ఆ జట్టుకు ఉంది. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ లాంటి ఆటగాళ్ళు ఆర్సీబీ జట్టుకు వెన్నెముక వంటి వారు. ఈ ఏడాది ఐపీఎల్ త్వరలోనే మొదలవ్వబోతున్న తరుణంలో అప్పుడే తీవ్ర చర్చలు మొదలవుతున్నాయి.
ఐపీఎల్ ఈ ఏడాది యుఏఈ లో నిర్వహించాలని బీసీసీఐ ప్రయత్నిస్తోంది. అక్కడ టోర్నమెంట్ జరిగితే మాత్రం ఆర్సీబీకి బాగా కలిసొచ్చే అవకాశం ఉందని ఆకాష్ చోప్రా చెబుతున్నాడు. యుఏఈలో పెద్ద గ్రౌండ్స్ ఆర్సీబీలో ఉండే స్పిన్నర్లకు బాగా కలిసొస్తుందని తెలిపాడు ఆకాష్ చోప్రా.
'గత 12 సంవత్సరాలుగా ఏమి జరిగిందో మరచిపోదాం.. ఈ ఏడాది ఐపీఎల్ యుఏఈలో జరిగితే.. ఏ జట్టుకు కూడా హోమ్ గ్రౌండ్, కలిసి వచ్చే పిచ్ లాంటివేవీ ఉండవు. ప్రతి జట్టు కూడా మొదటి నుండి ప్రణాళిక వేసుకుని ఒక్కో జట్టుతో తలపడాల్సి ఉంటుంది. ముంబై, చెన్నై జట్లు నిదానంగా మొదలుపెట్టినప్పటికీ చివరికి టాప్ లోకి చేరే అవకాశం ఉంది' అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు ఆకాష్ చోప్రా.
'ఆర్సీబీకి అంత గొప్ప బౌలింగ్ లైనప్ లేదన్నది తెలిసిన విషయమే.. గత ఏడాది సొంత గ్రౌండ్ లో కేవలం మూడు మ్యాచ్ లు మాత్రమే గెలవగలిగింది. లిమిటెడ్ బౌలింగ్ అటాక్ ఉన్నప్పటికీ యుఏఈలో టోర్నీ జరిగితే మాత్రం బాగా కలిసివచ్చే అంశమే.. యుఏఈ లో ఉన్న పెద్ద బౌండరీలు ఆర్సీబీ స్లో బౌలర్లకు కలిసొస్తాయి. యజువేంద్ర చాహల్, పవన్ నేగీలు మంచి ప్రదర్శన కనబర్చాలి' అని ఆకాష్ చోప్రా తన యుట్యూబ్ ఛానల్ లో తెలిపాడు. కింగ్స్ లెవెన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు కూడా మంచి స్పిన్నర్లు ఉండడంతో అవి కూడా యుఏఈలో మంచి ప్రదర్శన కనబర్చవచ్చని అంచనా వేస్తున్నాడు.
'కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టుకు కూడా యుఏఈ కలిసి వచ్చే అంశమే.. గ్లెన్ మ్యాక్స్ వెల్ కు యుఏఈ లో మంచి రికార్డు ఉంది. వారి స్పిన్ డిపార్ట్మెంట్ కూడా బాగానే ఉంది. జట్టు కూడా సమతూకంతో ఉంది. ఈ సీజన్ లో కింగ్స్ లెవెన్ పంజాబ్ మంచి విజయాలు సాధించే అవకాశాలు ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కూడా స్పిన్ అంశం కలిసొస్తుంది. రవి చంద్రన్ అశ్విన్, అమిత్ మిశ్రా, సందీప్ లెమిచానే, అక్షర్ పటేల్ లతో స్పిన్ బౌలింగ్ లైనప్ కలిసొచ్చే అంశమే' అని తెలిపాడు.
భారత్ లో మ్యాచులు నిర్వహించడానికి సాధ్యం కాదని, యూఏఈలో మ్యాచులు నిర్వహించుకునేందుకు అనుమతించాలని కోరుతూ ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ‘దేశంలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నందున్న ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించాలని నిర్ణయించామని, సెప్టెంబర్-నవంబర్ మధ్యలో లీగ్‌ను నిర్వహించేందుకు షెడ్యూల్‌ను రూపొందించామని, విదేశీ గడ్డపై మ్యాచ్‌ల నిర్వహణకు భారత ప్రభుత్వం అనుమతి మంజూరు చేయాలని కోరుతున్నామని కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.