ఆరేళ్ల చిన్నారి ఆద్య కుటుంబంలో మరో విషాదం.. తండ్రి ఆత్మహత్య
By సుభాష్ Published on 11 July 2020 3:28 PM ISTఆరేళ్ల చిన్నారి ఆద్య కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. కూతురు మరణాన్ని జీర్ణించుకోలేక తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భువనగిరిలో ఆద్య తండ్రి కల్యాణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, వారం రోజుల కిందట ఘట్‌కేసర్‌లో కరుణాకర్ అనే వ్యక్తి చిన్నారి ఆద్యను హతమార్చిన విషయం తెలిసిందే. ఆద్య మరణంతో తీవ్ర మనోవేదకు గురైన తండ్రి కల్యాణ్.. రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆద్య తండ్రి భువనగిరిలో పంచాయతీ సెక్రటరీగా పని చేస్తున్నాడు. ఆద్య తల్లికి కరుణాకర్‌తో వివాహేతర సంబంధం కారణంగానే ఆద్యను కరుణాకర్ కిరాతకంగా చంపేశాడు.
కాగా, జూలై 2న మేడ్చల్ జిల్లా పోచారంలో తల్లి వివాహేతర సంబంధం అభం శుభం తెలియని చిన్నారిని బలితీసుకున్న విషయం తెలిసిందే. కల్యాణ్, అనూష దంపతులు పోచారంలోని ఇస్మాయిల్‌గూడ విహారి హోమ్స్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఆరేళ్ల కుమారై ఆద్య ఉంది. కాగా.. మూడు నెలల క్రితం సికింద్రాబాద్‌లోని భవానీనగర్‌కు చెందిన కరుణాకర్‌తో అనూషకు ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. కాగా.. కొద్ది రోజలుగా అనూష రమేష్ అనే మరో యువకుడితో సన్నిహితంగా ఉంటుంది. ఈ విషయం తెలిసిన కరుణాకర్ ఆగ్రహానికి లోనైయ్యాడు.
కాగా, జూలై 2న మధ్యాహ్నం 12.30గంటల సమయంలో అనూష ఇంటికి కరుణాకర్ వచ్చాడు. అయితే.. అప్పటికే అక్కడ రమేష్ ఉన్నాడు. కరుణాకర్ రాకను గమనించిన అనూష.. రమేష్‌ను బాత్‌రూంలో దాచింది. గదిలోంచి బయటకు రావాలని రమేష్‌ను ఒత్తిడిచేశాడు. బయటకు రాకపోతే చిన్నారి ఆద్యను చంపుతానని కరుణాకరన్ బెదిరించాడు. అయినా అతడు బయటకు రాకపోవడంతో అన్యాయంగా ఆ చిన్నారి గొంతు కోసి చంపాడు. ఆద్య అరుపులతో రమేశ్ బయటకు వచ్చాడు. రమేశ్‌పై కూడా కత్తితో దాడిచేయగా.. అతడు పరుగులు తీశాడు. అనంతరం తన గొంతును తానే కోసుకున్నాడు కరుణాకర్. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని కరుణాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇప్పటి నుంచి ఇప్పటి వరకూ కూతురు మరణాన్ని జీర్ణించుకోలేకపోయినా తండ్రి కల్యాణ్ చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.