ఆవులకు ఆధార్ కార్డు ఇవ్వమంటున్న 'మిరపకాయ బాబాజీ'

By సుభాష్  Published on  23 Jan 2020 6:57 AM GMT
ఆవులకు ఆధార్ కార్డు ఇవ్వమంటున్న మిరపకాయ బాబాజీ

ముఖ్యాంశాలు

  • మిర్చి బాబా వింత డిమాండ్‌

  • విచిత్రమైన డిమాండ్లలో ముందున్నబాబాజీ

“అందరికీ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడెంటిటీ కార్డులు ఇస్తున్నారుగా. మరి ఆవులేం పాపం చేశాయి? వాటికీ ఆధార్ కార్డులు ఇవ్వాలి. వాటికీ ఓటర్ ఐడీలు ఇచ్చి తీరాలి”

ఈ వింత డిమాండ్ చేస్తున్నది ఒక వింతన్నర బాబాజీ. ఆయన పేరు మిర్చీ బాబా అంటే మిరపకాయ బాబా. నిజానికి ఆయనకు మహామండలేశ్వర్ వైరాగ్యానంద గిరి అనే సన్యాస నామం ఉంది. కానీ ఆయనను అందరూ మిర్చీ బాబా అనే పిలుస్తారు. ఆయన ఇలాంటి విచిత్రమైన డిమాండ్లను ముందుకు తెస్తూంటారు. ఆవులు ఓటరు కార్డులేమిటి? ఆవుల వేలి ముద్రలు తీసుకోవాలా, కాలి గిట్టల ముద్రలు తీసుకోవాలా? ఆవు తన పేరు, బర్త్ సర్టిఫికేట్ ఎలా తెస్తుంది? వంటి ప్రశ్నలకు ఆయన దగ్గర జవాబులుండవు. దేశంలోని సాధువులందరూ కలిసి, ఆవును “జాతీయ మాత” గా ప్రకటించాలని ఆయన డిమాండ్. అందులో భాగంగానే ఆవులకు ఓటర్ కార్డులు, ఆధార్ ఇవ్వాలంటున్నారు మిర్చీ బాబా.

ఆ బాబాజీ వివాదాలు మరో పేరు. మరో మాటలో చెప్పాలంటే వివాదాలు ఆయన వెన్నంటే ఉంటాయి. బాబాజీ కాంగ్రెస్ పార్టీకి దుర్ఘోర మద్దతుదారుడు. కాంగ్రెస్ పార్టీ తరఫున లోకసభ ఎన్నికల సమయంలో పెద్ద పెద్ద యజ్ఞాలు చేశారు. కాంగ్రెస్ దిగ్గజం దిగ్విజయ్ సింగ్ గెలుపు కోసం ఆయన ఐదు టన్నుల మిరపకాయలతో మహా హోమం కూడా చేశాడు. పైగా దిగ్విజయ్ ఓడిపోతే తాను జలసమాధి చేస్తానని ప్రకటించారు. హోమంలో పాల్గొన్నవారంతా మిరపకాయ కోరు వల్ల బోలెడన్ని తుమ్ములు, దగ్గులూ దగ్గనైతే దగ్గారు కానీ, దిగ్గీ రాజాకు వోటెయ్యలేదు. ఆయన సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ చేతుల్లో ఘోర ఓటమి పాలయ్యారు.

ఎన్నికల తరువాత ఆయనను ఇంటర్ నెట్ లో ట్రోల్ చేసి, జల సమాధి తీసుకొమ్మని ప్రజలు అడిగారు. అంతే కాదు.. ఆయన జల సమాది ఎప్పుడు తీసుకుంటారని అడుగుతూ మూడు వేల ఫోన్ కాల్స్ వచ్చాయట. ఇన్నాళ్ల తరువాత ఇప్పుడాయన మళ్లీ తెరమీదకి వచ్చి ఆవులకు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు అడుగుతున్నారు. ఇంతకీ ఆవులు ఈవీఎంల మీటను ఎలా నొక్కుతాయి చెప్మా!!!

Next Story