ఎదురీత.. అడుగడుగూ వెత..!

By మధుసూదనరావు రామదుర్గం  Published on  21 Aug 2020 1:35 PM GMT
ఎదురీత.. అడుగడుగూ వెత..!

ముప్పై ఏళ్ళ మహిళ.. చేతిలో ఇంగ్లిష్, జియోగ్రఫీల్లో డబుల్‌ మాస్టర్‌ డిగ్రీ, వీటితోపాఉ బీఎడ్‌ డిగ్రీ చదువుకుని గత పదేళ్లుగా స్కూల్‌ టీచర్‌గా పనిచేస్తోంది. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆమె కోల్‌కతాలోని ఠాకూర్‌పుకూర్‌ లో తల్లితోపాటు జీవనం సాగిస్తోంది. ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్న ఆమె మంచి అవకాశాల కోసం నిరీక్షిస్తోంది. అయితే దురదృష్టం కొద్దీ ఇప్పటిదాకా కష్టాలే తప్ప జీవితంలో మంచి మలుపులు చూడలేకపోతోంది.

అయినా ఇందులో ఏముంది? ఓ సాధారణ మహిళ ఎదుర్కొనే సమస్యలే కదా! అనిపిస్తోంది కదూ...సరే ఆమె మొదట పురుషుడిగా ఉండి సర్జరీ ద్వారా స్త్రీరూపమెత్తిందంటే.. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉంది కదూ.. రండి హిరణ్మయ్‌ డే సుచిత్ర డేగా మారాక జీవన విధానం , ఎదుర్కొంటున్న వివక్ష అన్నింటినీ భరిస్తూ.. కష్టాల్లో మునిగి ఏటికి ఎదురీదుతోంది. అత్యంత సాహసోపేత జీవితాన్ని కొనసాగిస్తున్న సుచిత్ర డే ను కాసింత పలకరిస్తే చాలు ఎన్నో అనుభవాల గాధలు వినిపిస్తారు. ఆ మాటల్లో మంటలు కనిపిస్తాయి.

శస్త్ర చికిత్స ద్వారా లింగమార్పిడి చేసుకున్నతర్వాత సుచిత్రకు కష్టాలేంటో ఒకటొక్కటిగా తెలిసొచ్చాయి. మనదేశంలో స్త్రీ, పురుష తేడాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. స్త్రీలను పురుషులతో సమానంగా చూడ్డం చాలా అరుదు. ఆడవాళ్లు ఈ పనులే చేయాలి.. మగవాళ్ళు ఈ పనులే చేయాలి అన్న కఠిన నియమాలతోనే సమాజం ఉంటుంది. ఏవో కొన్ని అరుదైన సందర్భాల్లో స్త్రీలను శక్తిమంతులుగా అంగీకరిస్తే అంగీకరిస్తారేమో గానీ చాలా మటుకు ఈ లింగవివక్ష సాధారణమై పోయింది. తరాలు మారినా ఈ విషయంలో మనుషుల అంతరాలు మాత్రం మారలేదు. స్త్రీ,పురుష విషయాల్లోనే ఇంత తారతమ్యాలుంటే.. ఇక లింగమార్పిడి చేసుకున్నవారి విషయం చెప్పక్కర్లేదంటోంది సుచిత్రడే. తృతీయ ప్రకృతికి చెందిన వారి ప్రతి కదలికల్ని సమాజం చాలా సూక్ష్మంగా గమనిస్తుంటుంది. వారు అందరిలా బతికే హక్కునే కోల్పోతారు. వారి భావోద్వేగాలను పట్టించుకునే వారే ఉండరనేది నిష్ఠురసత్యం. ఈ మధ్య కాలంలో ట్రాన్స్‌జెండర్ల కోసం పాటుపడే స్వచ్చంద సంస్థలు వచ్చాయి కానీ వాటి సేవలు ఇలాంటి వారందరికీ అందుబాటులో ఉన్నాయా అంటే ప్రశ్నార్థకమే!

సుచిత్ర డే లైఫ్‌ బియాండ్‌ నంబర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ట్రాన్స్‌జెండర్‌ మహిళ సమాజంలో ఎలాంటి అవమానాలు, చీత్కారాలు ఎదుర్కొంటుందో.. ఎవరూ పట్టించుకోని ధోరణి ఎంత నరకంగా ఉంటుందో చాలా వివరంగా తెలిపారు. కన్నతల్లి నా రూపాన్ని మన్నించినా జనాలు మాత్రం అవహేళన చేస్తునే ఉన్నారు. ముఖ్యంగ నగర వాసులు ఆలోచనా ధోరణి ఈ విషయంగా చాలా మారాల్సి ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. లింగమార్పిడి చికిత్స కాకముందు సుచిత్రడే.. హిరణ్మయ్‌ డే గా పురుషరూపంలో ఉండేది. 2007లో తన ఆలోచనల్లో తొలిసారిగా ఓ మార్పు కనిపించింది. బ్రహ్మ పొరపాటుగా తనను ఆడశరీరం బదులు మగశరీరంలో ఉంచాడని భావించింది. ఈ తప్పును దిద్దుకోవాలని తెగ ఆలోచించింది. భౌతికంగా పురుష రూపంలో ఉన్నా తన మానసిక రూపం మాత్రం స్త్రీలాగానే ఉండేదని సుచిత్ర వివరించింది. ఇది ఓ ట్రాన్స్‌జెండర్‌ వేదనా గాధ కాదు.. ఓ చక్కని వెలుగున్న భవిష్యత్తును ఆశిస్తున్న సాహసి గాధ అని సుచిత్ర అంటారు.

నా చిన్ననాటి నుంచే జీవితంపై అసంతృప్తిగా ఉండేది. నేను అమ్మాయిల దుస్తులు ధరిస్తే చుట్టుపక్కల వాళ్ళు వెక్కిరించేవారు, హేళన చేసేవారు. ఎల్‌.జి.బి.టి. క్యూ వర్గానికి చెందిన నాలాంటి వారు నిత్యం ఇలాంటి అవమానాలు ఎదుర్కోవాల్సిందే ! పలు నగరాలు తిరిగాను, విభిన్న మనుషులను చూశాను. కానీ మా విషయంలో వచ్చేసరికి అందరూ ఒకేలా వ్యవహరిస్తున్నారు. ట్రాన్స్‌ జెండర్ల మనోభావాలు వారు ఎన్నటికీ అర్థం చేసుకోలేరు. ఎల్‌.జి.బి.టి.క్యూ వర్గానికి చెందిన వారికి చదువుకోడానికి కూడా అవకాశాలు తక్కువగా ఉంటాయి. ప్రధానంగా 50 నుంచి 70 ఏళ్ల వయసు వారి మైండ్‌సెట్‌ అసలు మారదు. వారు చాలా నిశ్చితాభిప్రాయాలతో ఉంటారు. యువత ఆలోచనలపై వీరి ప్రభావం చాలా ఉంటుంది.

అందుకే పిల్లలు, యువకులు, ముసలి వాళ్ళు అందరూ మమ్మల్ని వెక్కింరించేవారే! ఈ అవమానాలను తప్పించుకోవాలంటే రెండే మార్గాలు ఒకటి వారికి దూరంగా ఉండటం.. లేదా ఇంటికే పరిమితం కావడం. కానీ ఇలా చేయడం వల్ల మేం సమాజంలో కలవలేకపోతున్నాము. మేము వేరు ఈ సమాజం వేరు అన్న భావన వచ్చేస్తుంది. అది ఇంకా ప్రమాదకరం. చదువు కోసం ఇంటర్వ్యూలకు వెళితే మొదట మా చదువు వివరాలు అడుగుతారు. ఆ తర్వాత మా జెండర్‌ తెలుసుకుని నిర్మొహమాటంగా రిజెక్ట్‌ చేసేస్తారు.

2014లో సుప్రీం కోర్టు మమ్మల్ని థర్డ్‌ జెండర్‌గా గుర్తించినా.. ప్రజల్లో ఆ అవగాహన రావడం లేదు. వారు చట్టాలను గౌరవించడం లేదు. ఎందుకంటే సుచిత్రలాంటి వారు ఈ సమాజంలో గొంతు పెగల్చలేరని వారి నమ్మకం. ఒక ప్రిన్సిపాల్‌ నా సర్టిఫికెట్లు పరిశీలించి సర్టిఫికెట్‌లో మేల్‌ అని ఉంది. నీవేమో స్త్రీలా ఉన్నావు.. మ్యాచి కావడం లేదు. మేల్‌ యూనిఫాం వేసుకువస్తే సీటిస్తా అంది. ఇలాంటివి చాలానే ఎదుర్కొన్నాను’ అంటూ సుచిత్ర డే తన అనుభవాలను వివరించారు.

తను ఆపరేషన్‌ చేసుకున్నప్పుడు కుటుంబంతో సహా ఎవరూ మద్దతు పలకలేదని కోల్‌కతాలోని ప్రఖ్యాత గాయని ప్రియా ఆచార్య మాత్రం తనకు చాలా సపోర్ట్‌ ఇచ్చారన్నారు. సుచిత్రకు ఒక ప్రియా ఉంది సరే.. ఎంతమంది సుచిత్రల్లా అవమానాలు ఎదుర్కొంటున్నారు.. అందరికీ ప్రియా లాంటివారు వెన్నంటి ఉంటారా అంటే సమాధానం చెప్పడం చాలా కష్టం!!

Next Story