సేవ.. సంతృప్తికిదో తోవ..!

By మధుసూదనరావు రామదుర్గం  Published on  21 Aug 2020 10:11 AM GMT
సేవ.. సంతృప్తికిదో తోవ..!

సాటి మనిషికి సేవ చేయాలనే ఆలోచన రావడమే ఓ అద్భుతం. కష్టపడి చదివిన చదువుకు ఓ మంచి ఉద్యోగం వచ్చేస్తే చాలు ఇక జీవితం బిందాస్‌ అనుకునే వారు కోట్లల్లో ఉంటారు. కానీ జీవితంలో ఉద్యోగం ఒకటే పరమావధి కాదు.. అంతకు మించి ఆలోచించాలి. అన్ని సౌకర్యాలుండి చదువుకునే వారికన్నా అదే వయసులోనో లేదా పుట్టుకతోనో దరిద్రం అనుభవించేవారూ ఉంటారు. వారి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాంటి ఆలోచనలు మేఘ,రుమాలాంటి వారే చేస్తుంటారు. అందుకే సమాజంలో మానవీయత ఇంకా మసకబారకుండా ఉంటోంది. సివిల్స్‌లో ఐఆర్‌ఎస్‌ సాధించిన మేఘ బార్గవ్, రెడ్‌క్రాస్‌ ద్వారా స్వచ్ఛంద సేవలందిస్తున్న రుమాభార్గవ్‌ ఇద్దరు అక్కాచెల్లెళ్లు సాటి మనుషుల బాధలు గురించి వారు అనుభవిస్తున్న దరిద్రం గురించి ఆలోచిస్తున్నారు కాబట్టే.. సామాజిక సేవలో లభించే సంతృప్తి మరే పనిలోనూ దొరకదంటున్నారు.

జీవితానికో అర్థం సాఫల్యత కేవలం ఉద్యోగం వల్ల రాదు.. సాటి మనుషులకు సేవలందిస్తేనే వస్తుందంటుంటారు డాక్టర్‌ మేఘ భార్గవ్‌. మంచి ఉద్యోగం, చక్కని కుటుంబ నేపథ్యం అన్నీ సరిగ్గా సమకూరిన వడ్డించిన విస్తరిలాంటిది ఆమె జీవితం. అయినా ఆమెలో తెలీని అసంతృప్తి సేవా మార్గంలో అడుగులేసేలా చేసింది. దంత వైద్యురాలైన మేఘ పట్టుదలతో ఐఆర్‌ఎస్‌ ర్యాంకు సాధించి రెవిన్యూ అధికారి అయ్యారు. అంతటితో సరిపోదనిపించి తన సోదరి రుమా భార్గవ్‌తో కలిసి స్వచ్ఛంద సేవల్లో పొల్గొంటోంది. సమర్పణ్‌ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా అనాథ పిల్లలను ఆదుకుంటోంది. అంతే కాదు ఈ కరోనా కాలంలో పేదలకు బాసటగా నిలుస్తోంది.

01

రాజస్థాన్‌లోని కోటా పట్టణానికి చెందిన మేఘ,రుమాలు చిన్నప్పటి నుంచి చదువంటే ఆసక్తి ప్రదర్శించేవారు. ‘మాకు చదువంటే ప్రాణం. ఏనాడు చదువు విషయంగా తల్లిదండ్రుల ఆకాంక్షల్ని వమ్ము చేయలేదు. రాజస్థాన్‌లో కోటా లాంటి చిన్న పట్టణం నుంచి ఉన్నత చదువులకై నగరబాట పట్టాము. అమ్మాయిలని ఏమాత్రం కంగారు పడక తల్లిదండ్రులు ధైర్యంగా మమ్మల్ని పంపించారు. మాకు ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారు. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో ఇద్దరిని ఉన్నత చదువులు...అదీ నగరంలో చదివించాలంటే మాటలా? అయినా తల్లిదండ్రులు ఏమాత్రం రాజీ పడకుండా మమ్మల్ని చక్కగా చదివించారు. వారి ఆశయాలకు అనుగుణంగా మంచి ఉద్యో గం సాధించాము. మేం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే దానికి అమ్మానాన్నల అండదండలే కారణం అంటారు మేఘభార్గవ్‌.

అక్కాచెల్లెళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి చదువుల్లో టాపర్లు. మేఘ దంతవైద్యం చదివి నాలుగేళ్ళు ప్రాక్టీసు చేశారు. రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన వివిధ ఉద్యోగులకు, మాజీ సైనికులకు సేవలందించారు. పబ్లిక్‌ సర్వీస్‌లో వెళ్ళాలన్న కోరిక బలంగా ఉండటంతో గ్రూప్‌కు ప్రిపేర్‌ అయ్యారు. ఐఆర్‌ఎస్‌ లో మంచి ర్యాంకు సాధించి, ప్రస్తుతం ముంబైలో ఆదాయపు పన్ను శాఖ డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

02

అలాగే రుమా ముంబై, సింగపూర్‌లలో పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ చదువుకున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌లో పనిచేస్తున్నారు. చదువు కోసం ఇద్దరం చాలా శ్రమించాం. అనుకున్నది సాధించాం. మంచి కొలువుల్లోనూ ఉన్నాం. ఇప్పుడు మాకు నలుగురికి తోచిన సాయం చేయాలన్న కోరిక ఉంది. అందుకే 2016లో సమర్పణ్‌ అనే స్వచ్ఛంద సంస్థ ప్రారంభించాం. ఈ సంస్థ ద్వారా కొందరి పేదల ముహాల్లోనైనా చిరు వెలుగులు తేగలిగితే అంతకన్నా మించిన తృప్తి మరొకటి ఉండదు మాకు అంటున్నారీ సోదరీమణులు.

మొదట వీరిద్దరూ రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌లోని పలు స్కూళ్ళను సందర్శించారు. అక్కడ చాలామంది పిల్లలకు సరిగా రాయడం చదవడం రాదు. చిన్న చిన్న లెక్కలు కూడా చేయలేకపోతున్నారు. వారి కుటుంబ నేపథ్యం కూడా అంతంత మాత్రమే. కడు పేదరికం అనుభవిస్తున్న ఆ పిల్లలు చదువులపై శ్రద్ధపెట్టలేకపోతున్నారని అక్కాచెల్లెళ్ళు గ్రహించారు. టీచర్లు, తల్లిదండ్రులతో ఓపిగ్గా మాట్లాడాక సమస్య మూలాలు తెలుసుకున్నారు. ఆ తర్వాతే స్కూల్‌ హెల్త్‌ కార్యక్రమాన్ని రూపొందించారు.

03

ఈ ప్రోగ్రాం కింద మూడు రాష్ట్రాల్లోని 41 గ్రామీణ పాఠశాలలకు సమర్పణ్‌ ద్వారా మంచినీరు అందిస్తున్నారు. దీని వల్ల దాదాపు 7400 మంది పిల్లలు లబ్ధి పొందుతున్నారు. అలాగే గిరిజన పాఠశాలలు, కళాశాలల విద్యార్థినులకు బయోడీగ్రేడబుల్‌ శానిటైజర్లు పంపిణీ చేస్తున్నారు. స్కూలు పిల్లల కోసం తరచూ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. పిల్లలకు కావల్సిన పుస్తకాలు, నోట్‌బుక్కులు తదితర సామగ్రిని ‘అధ్యయన్‌ కిట్‌’ పేరిట అందజేస్తున్నారు.

రాజస్థాన్‌లోని కోలిపురా గ్రామంలో నేటికీ కరెంటు లేదు. వారి కష్టాలను గమనించి సోలార్‌ ల్యాంపుల్ని సమర్పణ్‌ ద్వారా పంపిణీ చేశారు. ‘మొదట్లో సంస్థకు సొంతంగా ఖర్చు చేయాల్సి వచ్చేది. అది అవసరాలకు సరిపోయేది కాదు. క్రమంగా సమర్పణ్‌ సేవలు గమనించి ఆకర్షితులైన పలువురు విరాళాలు ఇస్తున్నారు. అయినా సంస్థకు అసలైన చోదకశక్తి మేఘ..’అంటూ రుమాభార్గవ్‌ తెలిపారు.

కరోనా దాడి నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు పలు కార్యక్రమాలు చేపట్టింది సమర్పణ్‌. మునిసిపల్‌ అధికారులు, స్థానిక అధికారులు, పోలీసుల సాయంతో ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో శానిటరీ కిట్స్, భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. దాదాపు 29వేల కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్లనూ అందించారు. ఇళ్ళులేని పేదలకు ఆరులక్షల భోజనాలందించారు. ఇవన్నీ కేవలం సంఖ్యలు కాదు అక్కాచెల్లెళ్ళ సేవాభావానికి చక్కని కొలమానాలు.

Next Story