అనుమతి లేకుండా కూరగాయలు విక్రయిస్తున్నాడు అంటూ ఒక రైతు పై ప్రభుత్వ అధికారి దురుసుగా ప్రవర్తించిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఓ మార్కెట్ కు తీసుకువచ్చిన కూరగాయలను తన వాహనంతో తొక్కించిన సంఘటన హపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. మార్కెట్ సెక్రెటరీ సుశీల్ కుమార్ వాహనం ఈ కూరగాయలను నాశనం చేస్తున్న దృశ్యాలు ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

సుశీల్ కుమార్ ఎస్యువి వాహనంతో పలుమార్లు ముందుకు వెళ్ళటం, రివర్స్ తీసుకోవడం ఈ వీడియో లో రికార్డయ్యాయి. పలువురు అధికారులు, స్థానికులు అక్కడే ఉన్నప్పటికీ ఎవరూ అతనిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అయితే వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సుశీల్ కుమార్ ఆ వాహనంలో లేరని, డ్రైవర్ విధంగా ప్రవర్తించారని అధికారులు చెబుతున్నారు. డ్రైవర్ ను మందలించి చేతులు దులుపుకున్నారు. రోడ్లపై కూరగాయలు విక్రయించ వద్దని, షాప్ లు లేనివారు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా రైతులు పట్టించుకోవట్లేదని అధికారులు చెబుతున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.