ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు ఆత్మహత్య.. ముగ్గురు మైనర్ అమ్మాయిలు కూడా..!
By సుభాష్ Published on 5 Sep 2020 8:41 AM GMTగుజరాత్ రాష్ట్రం లో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. దాహోద్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన వారిలో ముగ్గురు మైనర్ అమ్మాయిలు కూడా ఉన్నారు.
దాహోద్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చూడగా సైఫీ దుదియావాలా తన భార్య ముగ్గురు కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. సుజాయ్ బాగ్ లోని రెంటెడ్ అపార్ట్మెంట్ లో అతడి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఫోన్ కాల్స్ కు స్పందించకపోవడం, డోర్ బెల్స్ కొట్టినా స్పందన రాకపోవడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారాన్ని అందించారు.
దుదియావాలా అతడి భార్య వయసు 40ల్లో ఉండవచ్చని.. వారికి కవలలు ఉన్నారు.. వారి వయసు 16 సంవత్సరాలు కాగా.. ఇంకో అమ్మాయి వయసు 7 సంవత్సరాలు. దూదియావాలా డిస్పోజబుల్ ప్లాస్టిక్ వస్తువుల ట్రేడర్ అని తెలుస్తోంది.
అతడి మృతదేహం వంటగదిలో ఉండగా.. భార్య, పిల్లల శవాలు గదిలో పడి ఉన్నాయని పోలీసు అధికారి తెలిపారు. మొదట యాక్సిడెంటల్ డెత్ గా పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. ఆర్థిక పరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయేమోనని కూడా ఆరా తీస్తున్నారు. ప్రాథమిక విచారణలో ఆ కుటుంబం ఆర్థిక సమస్యలతో కొట్టు మిట్టాడుతోందని గుర్తించారు. కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. ఆ కుటుంబం విషం తీసుకుందని అనుమానిస్తూ ఉన్నారు. అలీరాజ్ పూర్ జిల్లా మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి కొన్ని సంవత్సరాల కిందట ఈ కుటుంబం వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. లాక్ డౌన్ కారణంగా దుదియావాలా వ్యాపారం బాగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. బంధువుల దగ్గర నుండి డబ్బు తీసుకుని రావడం.. ఆ తర్వాత వాటిని కట్టలేకపోతున్నానన్న బాధ ఆయనను వెంటాడడంతో ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని భావిస్తూ ఉన్నారు.