కరోనా ఎఫెక్ట్.. కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థ
By Newsmeter.Network Published on 19 March 2020 2:31 PM ISTప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. సుమారు 161 దేశాల్లో కరోనా వైరస్ ప్రభావం ఉండటంతో ఆ దేశాలు అల్లాడిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ భారిన పడి సుమారు 8వేలకు పైగా మృతిచెందగా, వైరస్ సోకిన వారి సంఖ్య 2లక్షలకు చేరుకుంది. రోజురోజుకు ఈ సంఖ్య పెరుగుతూనే వస్తోంది. దీంతో అన్ని దేశాలు హైఅలర్ట్ ప్రకటించాయి. పలు సంస్థలు మూతపడుతున్నాయి. ప్రధాన స్టాక్ మార్కెట్లన్నీ గత రెండు నెలల వ్యవధిలో 20శాతం మేర నష్టాల పాలయ్యాయి. జనవరి 24న ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాపై తొలి సమావేశం ఏర్పాటు చేసినప్పటి నుండి ఇప్పటి దాకా అంతర్జాతీయ ముడి చమురు ధరలు 50శాతం వరకు క్షీణించాయి. విమానయానం, పర్యాటకం, ఆతిధ్యం, సినిమా రంగాలు భారీగా దెబ్బతిన్నాయి. అగ్రరాజ్యం అమెరికా వంటి దేశాల్లో ఉన్నట్లుండి ఉద్యోగాల కోత పెరిగింది. ఆ దేశంలో నిరుద్యోగ రేటు 1929 నాటి సంక్షోభ స్థాయికి చేరింది. స్పెయిన్, నార్వే, చైనా, దక్షిణ కొరియా, ఇటలీలో్లనూ ఇదే తరహాలో ఉద్యోగాల కోత కనిపిస్తోంది.
భారత్‌లోనూ ఆర్థిక మాంద్యం..
భారత్ ఆర్థిక వ్యవస్థపైనా కరోనా వైరస్ ప్రభావం పడింది. దేశంలో హై అలర్ట్ ప్రకటించారు. ప్రధాన సంస్థలన్నీ మూతపడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థపై ఈ పరిణామాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. భారత్‌లో ఇప్పటికే మందగమనం నడుస్తోంది. సెప్టెంబర్ - డిసెంబరు త్రైమాసికంలోభారత వృద్ధి రేటు ఏడేళ్ల కనిష్ట స్థాయి (4.7)కి చేరింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్రం అడుగులు వేస్తున్నా కరోనా ప్రభావంతో దేశం మరింత ఆర్థిక మాంద్యంలోకి నెట్టివేయబడుతుంది. ఇప్పటికే షాపింగ్ మాళ్లు, సినిమా హాళ్లును దాదాపు అన్ని రాష్ట్రాల్లో మూసివేయించారు. ఐపీఎల్ వంటి పెద్ద ఈవెంట్లు కూడా వాయిదా పడ్డాయి. ఇవన్నీ ఉపాధిని పోగొట్టేవే. పెద్దపెద్ద వ్యాపారాలను ఆర్థికంగా దెబ్బతీసేవే. మార్చి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 0.20శాతం మేరకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, ఆటో మొబైల్స్ వంటి రంగాలు కరోనా వైరస్‌తో దెబ్బతింటాయని, ఫలితంగా ఆర్థిక వృద్ధి మందగిస్తుందని తాజాగా యూబీఎస్ సెక్యురిటీస్ నివేదిక స్పష్టం చేసింది. 2020 మార్చి క్వార్టర్‌లో జీడీపీ వృద్ధి రేటు 0.20 శాతం తగ్గవచ్చని తాము అంచనా వేస్తున్నామని ఈ నివేదిక వెల్లడించింది. ఇక 2020- 21లో భారత ఎకానమీ 5.6 శాతమే వృద్ధి సాధిస్తుందని, మరుసటి ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు కోలుకోవచ్చని యూబీఎస్ నివేదిక అంచనా వేసింది.
పర్యాటక రంగంపైనా 'కరోనా' పంజా..
భారత దేశ పర్యటక రంగంపైనా కరోనా ప్రభావం పడింది. ఈ రంగంలో రూ. 5లక్షల కోట్ల విలువైన వ్యాపారం దెబ్బతిందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పర్యాటక మంత్రిత్వ శాఖ పేర్కొంది. బుధవారం రవాణా, పర్యాటకం, సాంస్కృతికాలపై పార్లమెంటు కమిటీ సమావేశం జరిగింది. 95శాతం చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలు కరోనా ప్రభావం వల్ల బాగా దెబ్బతిన్నాయని, దీని వల్ల ప్రత్యక్షంగా 2.5కోట్ల మంది, పరోక్షంగా 2కోట్ల మంది ఉపాధి కోల్పోయారని వారు తెలిపారు. దీనిని బట్టి చూస్తుంటే కరోనా వైరస్ ప్రభావం ఏమేరకు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందో అర్థమవుతోంది. కరోనా వైరస్ ప్రభావం స్టాక్ మార్కెట్లు పైనా పడింది. గురువారం సైతం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 1652 పాయింట్లు నష్టపోయి 27217 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అటు నిఫ్టీ సైతం కీలకమైన 8000 పాయింట్ల దిగువన ప్రారంభమైంది. నిఫ్టీ ప్రారంభంలోనే 500 పాయింట్లు నష్టపోయి 7367 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 1321 పాయింట్లు నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టీ 20 పాయింట్ల దిగువకు పతనమైంది. ఐటీ స్టాక్స్ కూడా భారీగా నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ సూచీ 4.7శాతం నష్టపోయింది. ఫలితంగా మూడు రోజుల్లో రూ. 15.72 లక్షల కోట్లు ఆవిరయ్యాయి.
బాలీవుడ్‌కు రూ. వెయ్యి కోట్లు నష్టం..
కరోనా వైరస్ ఎఫెక్ట్ బాలీవుడ్‌కు తాకింది. అన్ని ఇండస్ట్రీస్‌కు సంబంధించిన పెద్ద సినిమాలు రీ షెడ్యూల్ చేయాల్సి వస్తోంది. ఇప్పటికే కరోనా ఎఫెక్ట్ కారణంగా అక్షయ్ కుమార్ 'సూర్యవంశీ' సినిమా సహా పలు సినిమాల విడుదల తేదీలు వాయిదా పడ్డాయి. అంతకాదు. దేశ వ్యాప్తంగా అన్ని సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ రద్దు చేయబడ్డాయి. కరోనా వైరస్ ఎఫెక్ట్ కారణంగా తెలంగాణ, ఢిల్లీ, రాజస్థాన్, ఆంద్రప్రదేశ్, గుజరాత్, కేరళ, కర్ణాటక, పంజాబ్, ఒడిస్సా రాష్ట్రాల్లో థియేటర్స్ బంద్ చేయించారు. దేశవ్యాప్తంగా సుమారు ౩వేలకుపైగా థియేటర్లు మూతపడినట్లు తెలుస్తుంది. దీంతో బాలీవుడ్‌కు దాదాపు వెయ్యి కోట్లు వరకునష్టపోయిందని ట్రేడ్ వర్గాల అంచనా. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమా థియేటర్లు బంద్‌తో కోట్లలో నష్టం వాటిల్లనుంది. సినిమా షూటింగ్‌లను ఎక్కడికక్కడ బంద్ చేశారు. దీంతో చిత్ర పరిశ్రమపై డైరెక్ట్ గా ఇన్ డైరెక్ట్ గా ఆధారపడ్డ చాలా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ఇలా అన్ని రంగాలపైనా కరోనా వైరస్ ప్రభావం పడటంతో లావాదేవీలుసైతం ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి.