• మహారాష్ట్ర, ఢిల్లీల్లో 144 సెక్షన్
  • అమెరికాలో 7 రాష్ట్రాలు లాక్ డౌన్

భారత్ లో కరోనా మృతుల సంఖ్య 7కి చేరింది. మహారాష్ట్ర, గుజరాత్, బీహార్ రాష్ట్రాల్లో ఒకే రోజు ముగ్గురు మృతి చెందడంతో మృతుల సంఖ్య పెరిగింది. బీహార్ లో మృతి చెందిన వ్యక్తి వయస్సు 38 సంవత్సరాలు కాగా..ఇప్పటి వరకూ దేశంలో మరణించిన అతి పిన్న వయస్కుడు ఇతనే కావచ్చు.

ఇటీవలే ఖతార్ నుంచి వచ్చిన 38 ఏళ్ల వ్యక్తికి కరోనా లక్షణాలుండటంతో పట్నాలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నాడు. కరోనా ప్రభావం ఎక్కువవ్వడంతో ఆదివారం మృతి చెందాడు. అలాగే మహారాష్ట్రలో 63 ఏళ్ల వ్యక్తి ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అయితే ఇతడికి కరోనాతో పాటు బీపీ, షుగర్, గుండె సంబంధిత సమస్యలు కూడా ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. గుజరాత్ లోని సూరత్ లో 69 ఏళ్ల వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా..మహారాష్ట్రలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకూ 74 మందికి కరోనా సోకినట్లు నిర్థారణయింది.

కరోనా ప్రభావం ఎక్కువవుతుండటంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల సీఎంలు లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఉత్తరాఖండ్ లో కూడా ఈ నెల 31వ తేదీ వరకూ జనతా కర్ఫ్యూ పాటించాల్సిందిగా ఈ రాష్ట్ర సీఎం ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు మహారాష్ట్ర, ఢిల్లీల్లో 144సెక్షన్ అమలు చేశారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని సీఎంలు పిలుపునిచ్చారు. అమెరికాలో సైతం 7 రాష్ట్రాలను లాక్ డౌన్ చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.