టిసిఎస్‌ను ఫాలో అవ్వాల్సిందే అంటున్న నిపుణులు..!
By తోట వంశీ కుమార్ Published on 2 May 2020 7:55 PM IST
కరోనా మహమ్మారి దెబ్బకు పలు సాఫ్ట్ వేర్ కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోమంటూ సూచనలు జారీ చేశాయి. మంచిగా ఇంటర్నెట్ ఉండి.. మారుమూల పల్లెల్లో కూడా హాయిగా ఉద్యోగం చేసుకోవచ్చు..! ఇలాగే లాక్ డౌన్ ముగిశాక కూడా కొనసాగితే ఎంతో మంచిదే కదా అని అనుకుంటారు కొందరు. కానీ కంపెనీలు ఆ ఛాన్స్ ఇవ్వాలి కదా.. కానీ ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) ఆ నిర్ణయమే తీసుకోబోతోంది. ఏకంగా 75శాతం మందిని వర్క్ ఫ్రమ్ హోమ్ కు పరిమితం చేయాలని అనుకుంటోంది.
టిసిఎస్ కంపెనీ లాక్ డౌన్ ముగిసిన తర్వాత కూడా ఉద్యోగుల్లో 75% మంది ఇంటి నుంచే పనిచేసేలా చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. సాధారణంగా టిసిఎస్ లో 20% మంది ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తుంటారు. 2025లోగా దీనిని దశలవారీగా 75 శాతానికి పెంచాలనే లక్షంతో ఆ సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా టిసిఎస్ లో 4.48 లక్షల మంది పనిచేస్తూ ఉండగా.. భారత్ లో టిసిఎస్ సంస్థలో 3.5లక్షల మంది పనిచేస్తున్నారు.
‘100 శాతం పనితీరు రాబట్టాలంటే కార్యాలయాల్లో 25% కన్నా ఎక్కువ ఉద్యోగులు అవసరమని మేం విశ్వసించడం లేదు’ అని టిసిఎస్ సివోవో ఎన్‌జి సుబ్రమణ్యం అన్నారు. కొత్త విధానంలో ప్రతి ఉద్యోగి కేవలం 25% కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. అన్ని బృందాలకూ ఇదే వర్తిస్తుందని అన్నారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న నేపథ్యంలో టిసిఎస్‌లోని 90% ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు.
టిసిఎస్ కంపెనీ తన మొత్తం ఉద్యోగులతో సెక్యూర్ బోర్డర్‌లెస్ వర్క్ స్పేస్ (ఎస్‌బీడబ్ల్యూఎస్) విధానంలో పనిచేయించింది. సక్సెస్ రేట్ కూడా బాగానే ఉందట. ఈ విధానంలో ఈ కొద్దిరోజుల్లో 35 వేల సమావేశాలు నిర్వహించారు. 40,600 కాల్స్, 340 లక్షల మెసేజ్‌లు వెళ్లాయని టీసీఎస్ సీఈఓ, ఎండీ రాజేశ్ గోపీనాథన్ చెప్పారు. ‘మేం బలంగా ముందుకొచ్చాం. మా విధానం గతం కన్నా ఎంతో మెరుగ్గా ఉందని నిరూపణ అయింది. ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం ద్వారా కార్యాలయ ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి’ అని గోపీనాథన్ అన్నారు. అందుకే దశల వారీగా 75 శాతం మంది ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేయించాలని టీసీఎస్ నిర్ణయించింది. టిసిఎస్ ఇందులో సక్సెస్ అయితే మిగతా ఐటీ కంపెనీలు కూడా ఇదే బాట పట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇకపై సంస్థలకు చాలా అంశాలు కలిసి రానున్నాయి.
రాజీవ్ గజేంద్రన్, ఫ్లోరిడాకు చెందిన బిజినెస్ ప్రొఫెసర్ టిసిఎస్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సమర్థించాడు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఉండే ఉద్యోగులకు చాలా వరకూ కలిసి వస్తుందని అన్నారు. టిసిఎస్ బాటనే ఇన్ఫోసిస్, విప్రో లాంటి సంస్థలు కూడా ఫాలో అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పెద్ద ఎత్తున వర్క్ స్పేస్ కూడా సంస్థలకు అవసరం ఉండదని.. ఖర్చులు కూడా సంస్థలు తగ్గించుకోవచ్చని అన్నారు.