షాకింగ్: ఆ ప్లాంట్‌లో 730 మందికి కరోనా.. 7వేల మందిని క్వారంటైన్‌కు తరలింపు
By సుభాష్
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ చాపకింద నీరులా వ్యాపించింది. దాదాపు 200లకుపైగా దేశాలకు విస్తరించి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇక తాజాగా జర్మనీలో మాంసం ప్యాకింగ్ చేసే ఓ ప్లాంట్‌లో ఏకంగా 730 మందికి కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు. జర్మనీలోని గిటరహ్ స్లో జిల్లాలోని నార్త్ రైన్-ఎస్‌ట్‌ఫాలియాలో మాంసం ప్యాకింగ్ చేసే ఓ ప్లాంట్‌లో ఈ కేసులు నమోదు కావడంతో , అధికారులు ఆ ప్లాంట్‌ను తాత్కాలికంగా మూసివేశారు.
అయితే ఇందుకు సంబంధించిన కాంటాక్ట్ ఆధారంగా మొత్తం 7వేల మందిని క్వారంటైన్‌కు తరలించారు. అలాగే అక్కడ ఈనెల 29వ తేదీ వరకూ స్కూళ్లు, డేకేర్ కేంద్రాలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కాగా, మరో 5వేల మందికి కరోనా పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు మీడియాకు వివరించారు. ఇక మరో వైపు ఈ ప్లాంట్‌లో కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందిందనే దానిపై అక్కడి ప్రభుత్వం విచారణ జరుపుతోంది. గత నెలలో కూడా ఇదే జిల్లాలో మరో ప్లాంట్‌లో 200 మందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలోటోనీస్ గ్రూప్ మీట్ ప్లాంట్ నుంచి సరఫరా చేసిన మాంసం తిన్నవారు కూడా ఆందోళనలో ఉన్నారు. ఒకేసారి ఇంత మందికి కరోనా సోకడంతో ప్లాంట్ పరిసరాల్లో శాటిటైజేషన్ చేస్తున్నారు.
ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 85 లక్షలకు చేరువలోంది. మరో పది రోజుల్లో కోటి వరకూ చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకూ 4,52,372 మంది మరణించారు.