భారత్‌లో ఒక్కరోజే 60 కరోనా పాజిటివ్ కేసులు!
By Newsmeter.Network Published on 21 March 2020 9:27 AM ISTకరోనా వైరస్.. ఇప్పుడు ఈ పేరు వింటేనే ఒక్కక్కరిలో వణుకు పడుతుంది. ఎప్పుడు ఎలా వస్తుందో అర్థంకాక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రపంచ దేశాలను ఈ వైరస్ గడగడలాడిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ సోకి 11,055 మంది మృతి చెందగా.. రెండున్నర లక్షల మంది వైరస్ సోకి చికిత్స పొందుతున్నారు. భారత్‌లోనూ ఈ వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం వైరస్ వ్యాప్తి చెందకుండా ఎన్ని చర్యలు తీసుకున్నా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టలేక పోతుంది.
ఫలితంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. భారత్‌లో ఇప్పటి వరకు 255 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మూడు రోజుల్లో దేశంలో కొత్తగా 110కి పైగా కేసులు నమోదైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. కరోనా వైరస్ ఏ విధంగా వ్యాప్తి చెందుతుందంటే.. శుక్రవారం ఒక్కరోజే భారత్‌లో 63పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఇప్పటి వరకు అత్యధికంగా మహారాష్ట్రంలో 52 కేసులు నమోదుకాగా, కేరళలలో 40 మందికి వైరస్ సోకింది. శుక్రవారం ఒక్కరోజే ఈ రాష్ట్రంలో 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఉత్తర ప్రదేశ్‌లో 23, తెలంగాణలో 19, ఢిల్లీలో 17, రాజస్థాన్‌లో 17, కర్ణాటకలో 15, లడఖ్‌లో 10, గుజరాత్‌లో 5, ఏపీలో 3, జమ్మూ కశ్మీర్‌లో 2, హిమాచల్ ప్రదేశ్‌లో ఒకటి చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఐదుగురు మృతి చెందారు. వీరిలో ఢిల్లీ, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్‌లో ఒక్కొక్కరు కరోనా వైరస్ కారణంగా మృతి చెందారు. ఇదిలా ఉంటే మొత్తం 255 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 30 మందికిపైగా విదేశీయులే ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.