52 ఏళ్ల మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చింది. కన్న కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించడం, కూతురు అత్తవారింటికి వెళ్ళి పోవడంతో తల్లడిల్లిన ఆ తల్లి మరోసారి మాతృత్వం కోసం ఆరాటపడింది. అందుబాటులో ఉన్న ఆధునాతన వైద్య విధానాన్ని ఉపయోగించుకుని ఐబిఎఫ్ సాయంతో ఇద్దరు కవల ఆడ పిల్లలకు జన్మనిచ్చింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన సత్యనారాయణ రమాదేవి దంపతులు తమకు బిడ్డ కావాలనే ఆశతో కరీంనగర్‌లోని సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆశ్రయించారు. ఐబిఎఫ్ ద్వారా చికిత్స తీసుకుని గర్భందాల్చిన రమాదేవి మూడు నెలలు ఆస్పత్రిలోనే ఉండి వైద్యసేవలు పొందారు. రమాదేవికి బిపీ, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ డాక్టర్ల నిరంతర పర్యవేక్షణ ఉండటం వల్ల నార్మల్ డెలివరీ జరిగింది. ఇద్దరు ఆడపిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు.

ఇటీవల 74 ఏళ్ల వయసులో ఓ మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన ఎర్రమట్టి రాజారావు, మంగాయమ్మ దంపతులకు ఐవీఎఫ్ విధానంలో సంతాన భాగ్యం కలిగింది. మంగాయమ్మ పెళ్లయిన 57 ఏళ్లకు, 74 ఏళ్ల వయసులో ఇద్దరు ఆడ పిల్లలకు జన్మనిచ్చారు.

సామ్రాట్

Next Story