50శాతం కరోనా పాజిటివ్ కేసులు ఆ ప్రాంతాల్లొనే..
By Newsmeter.Network Published on 4 April 2020 2:44 AM GMTప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ భారత్‌లో విజృంభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడికి పటిష్ఠ చర్యలు చేపడుతున్నా.. కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజుకు పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఒక్క శుక్రవారమే 75 పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే కరోనా వ్యాప్తి రాష్ట్రంలో ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 229 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 11 మంది చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలంగాణలో నమోదైన కేసుల్లో 50శాతం పాజిటివ్ కేసులు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి ప్రాంతాల్లోనే నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. తర్వాత వరుసలో వరంగల్ అర్బన్, కరీంనగర్ జిల్లాలు నిలిచాయి. హైదరాబాద్‌లో 50 పాజిటివ్ కేసులు నమోదుకాగా రంగారెడ్డిలో 15, మేడ్చల్‌లో 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మూడు జిల్లాల్లో కలిపి మొత్తం 76శాతం కేసులు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత స్థానాల్లో అత్యధికంగా వరంగల్ అర్బన్ జిల్లాలో 18 పాజిటివ్ కేసులు, కరీంనగర్ జిల్లాలో 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Also Read :రెండోసారి కరోనా నిర్దారణ పరీక్ష.. ఆశ్చర్యపోయిన ట్రంప్..!
రాష్ట్రంలో బుధవారం వరకు కరోనా వ్యాప్తి అదుపులోనే ఉందని అధికారులు భావించారు. సీఎం కేసీఆర్‌సైతం మన రాష్ట్రంలో కరోనా పెద్దగా ప్రభావం చూపించలేదని, త్వరలోనే లాక్ డౌన్‌ను ఎత్తివేస్తామని తెలిపారు. కానీ అనూహ్యంగా ఒక్కసారిగా 60 ఉన్న పాజిటివ్ కేసులు శుక్రవారంకు 229కి చేరాయి. దీనికి కారణం ఢిల్లిలో తబ్లిగీ జమాత్ సంస్థ నిర్వహించిన మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారే కావటం గమనార్హం. ఈ ప్రార్థనలకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి 1030 మంది వరకు వెళ్లొచ్చారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 603 మంది ఉండగా, జిల్లాలకు చెందిన వారు 427 మంది ఉన్నారు. వీరిలో విదేశీయులు కూడా ఉన్నారు.
Als0 Read :రెండు రోజులుగా ఇంట్లోనే తల్లి, కుమారుడి మృతదేహాలు..
ఇదిలా ఉంటే ఇప్పటికి అధికారులు వీరిలో కొందరినే క్వారంటైన్‌కు తరలించారు. ప్రస్తుతం నమోదవుతున్న పాజిటివ్ కేసులన్నీ ఢిల్లి వెళ్లి వచ్చిన వారు, వారి బంధువులవే కావడం గమనార్హం. ఇంకా పలువురు తబ్లిగీలు తప్పించుకొని తిరుగుతుండటం మరింత ఆందోళనకు గురిచేస్తుంది. దీంతో వీరి ద్వారా మరింత మందికి కాంటాక్ట్ కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరిలో అధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ప్రాంతాల నుంచే ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆ మూడు ప్రాంతాల్లో 50శాతం పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరిన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ప్రతీ ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.