తెలంగాణలో 42 మంది చిన్నారుల మిస్సింగ్‌.. జవాబివ్వని అధికారులు.!

By అంజి  Published on  6 Feb 2020 7:01 AM GMT
తెలంగాణలో 42 మంది చిన్నారుల మిస్సింగ్‌.. జవాబివ్వని అధికారులు.!

హైదరాబాద్‌: ఆ 42 మంది చిన్నారులు ఏమయ్యారు. ఎక్కడున్నారు.. వారు ట్రాఫికింగ్‌ ముఠాల చేతికి చిక్కారా? లేదా మానవ అవయవాల దోపిడీ ముఠాల బారిన పడ్డారా?. ఇదే ఇప్పుడు తెలంగాణలో హాట్‌టాఫిక్‌గా మారింది. రాష్ట్రంలో ఎంతో మంది వీధి బాలలు ఉన్నారు. రోడ్లపై అనాథ బాలలు, తల్లిదండ్రులున్నా ఆలనాపాలనా లేని వీధి బాలలు ఇలా ఎంతో మంది. అయితే వారిని వివిధ జంక్షన్లలో, రైల్వేస్టేషన్‌లలో రాష్ట్ర శిశు సంక్షేమ అధికారులు గుర్తించారు. అనంతరం వారిని హైదరాబాద్‌లోని చైల్డ్‌ హోమ్‌లకు తరలించారు. అలా వచ్చిన వారిలో 42 మంది చిన్నారులు మిస్‌ అయ్యారని, ఆ చిన్నారులు ఎక్కడున్నారనే ప్రశ్నకు రాష్ట్ర మహిళా శిశసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ నుంచి ఎటువంటి సమాధానం లేదంటూ, అసలు వారు ఎక్కడి మిస్‌ అయ్యారన్న దానిపై ఆందోళన కూడా అధికారుల్లో కనిపించడం లేదని ఓ ప్రముఖ దినపత్రిక పతాక శీర్షికలో కథనం వెలువరించింది.

ఇప్పుడు ఇదే విషయమై కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగిందని. ఎన్జీవోల ద్వారా విషయం తెలుసుకున్న కేంద్రం మహిళా శిశు సంక్షేమ శాఖ లోగుట్టుపై ఆరా తీస్తోందంటూ. చిన్నారుల మిస్సింగ్‌పై పలు మార్లు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం లేఖలు రాసినట్లు సదరు దినపత్రిక క‌థ‌నంలో పేర్కొంది.

రోడ్లపై కనిపించే వీధి బాలలను, అనాథాలను బాలల సంరక్షణ అధికారులు గుర్తించి.. వారిని జిల్లా బాలల సంక్షేమ కమిటీలకు అప్పగిస్తారు. ఆ తర్వాత వారి పేర్లను రికార్డుల్లో, పోర్టల్‌లో నమోదు చేసి.. చైల్డ్‌ హోమ్‌లు, శిశువిహార్‌లకు తరలిస్తారు. ఐదేళ్లలోపు చిన్నారులను మాత్రం హైదరాబాద్‌లోని శిశువిహార్‌కు తరలిస్తారు. చిన్నారులను తరలించేటప్పుడు ఎస్కార్ట్‌గా పోలీసులు ఉంటారు. పోలీస్‌ శాఖలోనూ జువైనల్‌ పోలీస్‌ టీమ్‌లు.. బాలల పరిరక్షణ అధికారులకు అనుసంధానంగా ఉంటారు. అయితే వారికి సమాచారం ఇవ్వకుండానే చిన్నారులను ఎందుకు తరలించారనేది ఇక్కడ ప్రశ్నగా మారింది.

"2019లో జిల్లాల నుంచి 42 మంది చిన్నారులను హైదరాబాద్‌ తరలించారు. అయితే వారంతా మధ్యలోనే మిస్సయ్యారా.. లేదా అనేది తెలియరాలేదు. దీంతో కేంద్రమహిళా శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. విధీ బాలలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. చిన్నారులను జిల్లాల నుంచి హైదరాబాద్‌కు పంపినట్లు నమోదు చేసిన రికార్డులను, హైదరాబాద్‌లోని చైల్డ్‌ హోమ్‌లోని రికార్డులను క్షుణంగా పరిశీలించారు. ఆ తర్వాత 42 మంది చిన్నారులు మిసయ్యారని అధికారులు గుర్తించారు. దీని కేంద్రం సంధించిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధనం లేదు. గత ఏడాది డిసెంబర్‌లో కేంద్రం సీరియస్‌గా ఆదేశాలు జారీ చేసినా.. అధికారుల్లో మాత్రం ఎలాంటి స్పందన లేదు. 42 మంది చిన్నారులు ఎక్కడున్నారో తెలుసుకోకుండా.. నిమ్మకు నీరెత్తినట్లు, ఏసీ రూమ్‌ల్లో కూర్చొని, తమకేం సంబంధం లేదనట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే మధ్యలోనే నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలు దత్తతలు జరిగాయా? లేకా ఇంకేమై ఉంటుంది. అయితే ఈ వ్యవహారాన్ని మాత్రం రాష్ట్ర అధికారులు తొక్కిపెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి." అంటూ ప్రముఖ దినపత్రిక తన కథనంలో పేర్కొంది.

Next Story