భారత్‌లో 34కు కరోనా కేసులు..

By అంజి  Published on  7 March 2020 3:18 PM GMT
భారత్‌లో 34కు కరోనా కేసులు..

ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నట్లు అనిపిస్తోంది. దీనికి సంబంధించి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

తాజాగా మరో మూడు కరోనా వైరస్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 34కు చేరింది. కొత్తగా ముగ్గురికి కరోనా వైరస్‌ సోకిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. లఢక్‌లో రెండు, తమిళనాడులో ఒక వైరస్‌ కేసు నమోదు అయ్యింది. ఒక వ్యక్తి ఒమన్‌ నుంచి తమిళనాడుకు రాగా, మరో ఇద్దరు ఇరాన్‌ నుంచి లఢక్‌ వచ్చారు. అయితే వీరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని సమాచారం.

తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరికి కరోనా సోకలేదని వైద్యులు తేల్చారు. శుక్రవారం రాత్రి కువైట్‌, నెదర్లాండ్‌ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు రుయాలో చేరారు. ఇద్దరు వ్యక్తుల రక్త నమూనాలను పరిశీలించి నెగిటివ్‌ అని వైద్యులు తేల్చారు.

ప్రపంచ వ్యాప్తంగా 90 దేశాలకు కరోనా వైరస్‌ వ్యాపించింది. కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరగడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపట్టింది.

ఇప్పటికే కరోనా వైరస్‌ కారణంగా 3,400 మంది మృతి చెందారు. కొన్ని వేల మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. భారత్‌లో దాదాపు 31 వేల మంది కరోనా అనుమానితులను పర్యవేక్షనలో ఉంచారు.

భూటాన్‌లో ఇద్దరు అమెరికన్లకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. అయితే వారితో కలిసి ప్రయాణించిన 150 మందిని భారత్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో పర్యవేక్షణలో ఉంచినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Next Story