విషాదం: పిడుగు పడి 22 మంది మృతి
By సుభాష్ Published on 25 Jun 2020 4:50 PM IST
భారీ వర్షాల కారణంగా పిడుగు పాటుకు అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఒకే కుటుంబంలో నలుగురు, ఐదుగురు చొప్పున మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. బీహార్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గడిచిన 24 గంటల్లో 22 మంది మృతి చెందడం కలచివేస్తోంది. ఈ మేరకు బీహార్ రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ప్రకటన విడుదల చేసింది. వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడిన ఘటనలో వీరంతా మృతి చెందినట్లు తెలిపింది.
అస్సాంలో ఒకే కుటుంబానికి ఐదుగురు, బక్సర్‌లో నలుగురు, ఔరంగాబాద్‌లో ఇద్దరు, నలందలో ఇద్దరు, జుమ్రుయిలో ఒక్కరు చొప్పున పిడుగు పాటుకు మరణించారు. కాగా, బీహార్‌లో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల వల్ల పెద్ద ఎత్తున నష్టాలు వాటిల్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.