అప్రమత్తంగా ఉన్నాం కాబట్టే.. తీవ్రత తగ్గింది
By తోట వంశీ కుమార్ Published on 1 May 2020 2:39 PM GMTతెలంగాణలో శుక్రవారం కొత్తగా మరో 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ రోజు నమోదైన వాటితో కలిపి రాష్ట్రంలో 1,044 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ మహమ్మారి భారీన పడి 28 మంది మరణించారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 464 మంది డిశ్చార్జి కాగా.. 552 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో లాక్‌డౌన్ పటిష్టంగా అమలు అవుతుందని, ప్రభుత్వానికి ప్రజలు అన్ని విధాలుగా సహకరిస్తున్నారన్నారు. కరోనా పరీక్షలు చేయకపోవడం వల్లే రాష్ట్రంలో తక్కువ కేసులు నమోదు కావడానికి కారణమని వస్తున్న ఆరోపణనలో నిజం లేదన్నారు. ఎంతో అప్రమత్తంగా ఉన్నాం కాబట్టే.. తీవ్రత తగ్గిందన్నారు. అభివృద్ది చెందిన దేశాలు సైతం ఈ మహమ్మారి బారిన పడి విలవిల లాడుతున్నాయని గుర్తు చేశారు. ఎక్కడ పడితే అక్కడ టెస్టులు చేయవద్దని ఐసీఎంఆర్ సూచించిందన్నారు. కరోనా పాజిటవ్‌గా నిర్థారణ అయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు మాత్రమే పరీక్షలు చేయాలని, కరోనా పాజిటివ్ వచ్చి లక్షణాలు లేకుంటే ఇంట్లో ఉంచి చికిత్స అందించాలని స్పష్టంగా చెప్పిందన్నారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సీఎం కేసీఆర్ అందరినీ అప్రమత్తం చేశారని మంత్రి స్పష్టం చేశారు.