203 జీవో ప్రగతి భవన్‌లోనే సిద్ధమైంది - రేవంత్‌రెడ్డి

By Newsmeter.Network  Published on  13 May 2020 10:34 AM GMT
203 జీవో ప్రగతి భవన్‌లోనే సిద్ధమైంది - రేవంత్‌రెడ్డి

ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్‌లను విడదీసి చూడలేమని, పాలు, నీళ్లులా వాళ్లు కలిసిపోయారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్‌ వద్ద కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలో రేవంత్‌ పాల్గొని ఆయన మాట్లాడారు.. గత ఏడాది ఆగస్టు 12న నగరి మీదుగా కేసీఆర్‌ కాంచీపురం వెళ్లేదారిలో వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంట్లో భోజనం చేశాడని, కేసీఆర్‌ రోజా ఇంటికి వెళ్లినప్పుడే రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పలేదా అంటూ ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రగతి భవన్‌లో సిద్ధం చేసిందేనని, మెగా కృష్ణారెడ్డిని పక్కన కూర్చోపెట్టుకొని ఈ ఒప్పందం చేసుకున్నారని రేవంత్‌ ఆరోపించారు.

Also Read :ఏపీ ప్రభుత్వం తీరును నిరసిస్తూ కాంగ్రెస్‌ నేతల దీక్ష

కేసీఆర్‌, జగన్‌ల నాటకాన్ని కాంగ్రెస్‌ బయటపెట్టిందని అన్నారు. గతంలో పోతిరెడ్డిపాడు ఎత్తు పెంచుతామంటే ఆనాడు పీజేఈఆర్‌, మర్రి శశిధర్‌ రెడ్డి వ్యతిరేకించారని అన్నారు. నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రాజెక్టులకు కేసీఆర్‌ ప్రాధాన్యం ఇవ్వటం లేదని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. కోవిడ్‌-19 గైడ్‌లైన్స్‌ ప్రతిపక్షాల మీదే ఈ ప్రభుత్వం ఉపయోగిస్తుందని, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌తో మనకు జరిగే అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామని రేవంత్‌ తెలిపారు. పలు మీడియా సంస్థలు కేసీఆర్‌ కుటుంబానికి ఇచ్చిన ప్రాధాన్యత ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వడం లేదని రేవంత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ఇలానే వ్యవహరిస్తే మేము సోషల్‌ మీడియాకు ప్రాధాన్యంఇస్తామని అన్నారు. మమ్మల్ని చూపెట్టని పేపర్లు, ఛానెల్స్‌ మాకెందుకని రేవంత్‌ పేర్కొన్నారు.

Next Story