ఆ సిక్స్ భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచిపోతుంది..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Jun 2020 2:32 PM IST
ఆ సిక్స్ భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచిపోతుంది..

భార‌త మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ 2011 వన్డే ప్రపంచకప్ శ్రీలంక జ‌ట్టుతో జ‌రిగిన‌ ఫైనల్లో కొట్టిన ఫినిషింగ్ సిక్స్ భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని బీసీసీఐ అధ్య‌క్షుడు, మాజీ టీమిండియా సార‌థి సౌరవ్ గంగూలీ అన్నాడు. శ్రీలంక పేస్ బౌల‌ర్‌ నువాన్ కులశేఖర విసిరిన బంతిని కళ్లుచెదిరే రీతిలో స్టాండ్స్‌లోకి తరలించిన ధోనీ.. 28 ఏళ్ల తర్వాత భారత్‌కు వరల్డ్‌కప్‌ని అందించాడు.

2011 ప్ర‌పంచక‌ప్ జ్ఞాప‌కాల‌ను నెమ‌రువేసుకున్న గంగూలీ మాట్లాడుతూ.. భార‌త్ ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన‌ ఆరోజు తనకు మరిచిపోలేని రోజ‌ని అన్నాడు. కెప్టెన్‌గా తన వ‌ల్ల సాధ్యంకానిది ధోనీ సాధించినందుకు సంతోషించిచాన‌ని తెలిపాడు. అంత‌కుముందు 2003 వరల్డ్‌కప్ ఫైనల్లో నా కెప్టెన్సీలోనే భార‌త జ‌ట్టు.. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిందనీ.. కెప్టెన్‌గా ధోనీకి వరల్డ్‌కప్ గెలిచే అవకాశం రావడం నాకు చాలా ఆనందాన్నిచ్చిందని గంగూలీ అన్నాడు.

ఫైన‌ల్ మ్యాచ్ జ‌రిగిన‌ రోజు నేను వాంఖడే స్టేడియంలోనే ఉన్నానని.. మ్యాచ్ అనంత‌రం ధోనీ, టీమిండియా సంబరాలను ప్ర‌త్య‌క్షంగా చూసేందుకు కామెంట్రీ బాక్స్ నుంచి కిందకి వచ్చానని గంగూలీ అన్నాడు. ఆ రోజు 2011 వన్డే ప్రపంచకప్‌ని భారత్ గెలవడం నా వరకూ మరిచిపోలేని రోజు.. ధోనీ కొట్టిన ఆ ఫినిషింగ్ సిక్స్ భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంద‌ని ఆ గొప్ప‌క్ష‌ణాల‌ను గంగూలీ గుర్తు చేసుకున్నాడు.

ఇదిలావుంటే.. 2011, ఏప్రిల్ 2న ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఆ ఫైనల్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. శ్రీలంక జ‌ట్టులో మహేల జయవర్దనే (103 నాటౌట్: 88 బంతుల్లో 13x4) సెంచరీతో చెలరేగాడు. త‌ర్వాత ల‌క్ష్య‌చేధ‌న‌కు దిగిన భార‌త జ‌ట్టులో ఓపెన‌ర్‌ గౌతమ్ గంభీర్ (97: 122 బంతుల్లో 9x4) రాణించ‌గా.. కోహ్లీ నిష్ర్క‌మ‌ణ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన‌ ధోనీ (91 నాటౌట్ : 79 బంతుల్లో 8x4, 2x6) ఆఖరి వరకూ క్రీజులో నిలిచి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో.. 48.2 ఓవర్లలోనే భార‌త్‌ను విజ‌య‌తీరాల‌కు చేర్చాడు.

Next Story