ఉమాదేవితో భామ స్నేహం.. చూడముచ్చటైన బంధం ఆ ఇద్దరిదీ..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Jun 2020 1:47 PM GMT
ఉమాదేవితో భామ స్నేహం.. చూడముచ్చటైన బంధం ఆ ఇద్దరిదీ..

చిన్న పిల్లలు ఎవరైనా బొమ్మలతోనో, ఇంటి చుట్టుపక్కల తమ వయసు పిల్లలతో ఆడుకుంటారు. లేదా ఇంట్లో ఉండే పెంపుడు కుక్కలతో కొద్దిసేపు ఆడుకుంటారు. కానీ కేరళలో ఉంటోన్న ఓ రెండేళ్ల చిన్నారి మాత్రం ఓ పెద్ద గజరాజుతో ఆడుకుంటోంది. ఆ చిన్నారి ఏనుగుతో స్నేహం చేస్తుంటే.. చూసేవారంతా అవాక్కవుతున్నారు. రెండ్రోజులుగా ఏనుగుతో కలిసి ఆ చిన్నారి నడుస్తోన్న ఫొటోలు, ఏనుగుతో ఆడుకునే, తిండి పెట్టే ఫొటోలు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. స్నేహానికి జాతితో పనిలేదు..మంచి మనసుంటే చాలన్న మాటలు మరోసారి ఈ రకంగా రుజువయ్యాయి.

భామ అని పిలవబడే ఆ పాప వయసు 2 సంవత్సరాలు. పాప తండ్రి పేరు మహేష్. కేరళ లోని తిరువనంతపురంలో వారి కుటుంబం నివాసముంటోంది. కొన్నేళ్లుగా ఓ ఏనుగును పెంచుకుంటున్నారు. ఆ ఏనుగుకు ఉమాదేవి అని పేరు కూడా పెట్టారు. ఆ ఏనుగుతోనే తమ కూతురు భామ తనకు 6 నెలల వయసున్నప్పటి నుంచి ఆడుకుంటోందని తండ్రి మహేష్ పేర్కొన్నారు. విచిత్రమేమిటంటే ఆ ఏనుగు కూడా పాప పుట్టినప్పటి నుంచి ఎంతో ఆప్యాయంగా చూసుకుంటోందట. ఎవ్వరినీ భామ జోలికి రానివ్వకుండా కంటికి రెప్పలా కాపాడుతుందని, భామ ఎక్కడికెళ్లినా ఉమాదేవి కూడా తనతోపాటే వెళ్తుందని చెప్పుకొచ్చారు మహేష్. ఎంత ముచ్చటేస్తుందో కదా..భామ - ఉమాదేవిల మధ్య స్నేహాన్ని చూస్తుంటే..

ఏనుగు అంటే అదేమీ పెద్ద క్రూరజంతువు కాదు. ఆకారం గాంభీర్యంగా ఉన్న మనసు మాత్రం చాలా సున్నితం. అంత సున్నితం కాబట్టే..గత నెలాఖరులో ఓ గర్భిణి ఏనుగు మానవత్వం లేని మనుషులు చేసిన మోసాన్ని తట్టుకోలేక తనువు చాలించింది. ఏనుగు చావుకు కారణమైన వారెవరో చెప్పిన వారికి పారితోషికం ఇస్తామంటూ పలువురు ప్రకటనలు చేస్తున్నారు.

Next Story
Share it