సుమో రెజ్లర్‌కు కరోనా.. వాయిదా పడ్డ టోర్నీ
By తోట వంశీ కుమార్ Published on 11 April 2020 6:58 AM GMTకరోనా వైరస్(కొవిడ్-19) ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే లక్ష మందికి పైగా మరణించారు. లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ ముప్పుతో ఇప్పటికే అన్ని క్రీడలు రద్దు అయ్యాయి. దీంతో క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. తాజాగా జపాన్ సుమో అసోసియేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఓ రెజ్లర్ కరోనా వైరస బారీన పడ్డాడని అందులో పేర్కొంది. రెజ్లర్‌లలో మొదటి కరోనా కేసు ఇదేనని తెలిపింది.
గత వారం ఆ రెజ్లర్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండడంతో అతడికి పరీక్షలు నిర్వహించినప్పుడు.. కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపింది. అయితే.. అతని పేరును, వ్యక్తి గత వివరాలను మాత్రం వెల్లడించేందుకు నిరాకరించింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా మిగతా రెజ్లర్ లకు, అధికారులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే వారందరికి నెగిటివ్ వచ్చింది. అయినప్పటికి ముందు జాగ్రత్త చర్యలో భాగంగా వచ్చే నెలలో ప్రాంరభం కానున్న సమ్మర్ గ్రాండ్ సుమో టోర్నమెంట్ వాయిదా వేశారు.
కాగా.. జపాన్‌లో ఇప్పటి వరకు 5,300 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మహమ్మారి వల్ల 88 మంది మరణించారు. ప్రభుత్వం ఈ వారంలో ఏడు ప్రాంతాలలో అత్యవసర స్థితిని ప్రకటించింది.