టెంట్ లో పడుకొని... పానీపూరి అమ్మి... 17 ఏళ్లకే డబుల్ సెంచరీ కొట్టాడు !!
By సత్య ప్రియ Published on 17 Oct 2019 10:31 AM GMTయశస్వి జైస్వాల్... ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో మారుమోగుతున్న పేరు. 17 ఏళ్ల వయసులోనే ప్రపంచ రికార్డు సాధించాడు. పిన్న వయసులోనే డబుల్ సెంచరీ బాదేసిన ఈ యువతేజం.. ఎందరో ప్రముఖల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే.. ఈ విజయం వెనుక ఓ కన్నీటి గాథ ఉంది. ఒకప్పుడు కడుపు నిండా తినడానికి తిండి లేక ఇబ్బందులు పడ్డాడు. ఉండటానికి గూడు లేకపోతే ఎటువంటి వసతి లేని గుడారాల్లో నివసించాడు. తల్లిదండ్రుల అండ లేకుండానే ఓవైపు క్రికెట్ సాధన సాగిస్తూ.. ఇంకోవైపు ఖర్చుల కోసం పానీపూరీలు అమ్మాడు.
విజయ్ హజారే ట్రోఫీలో ముంబయి టీనేజర్ యశస్వి జైస్వాల్ రికార్డు పుటల్లోకెక్కాడు. దీంతో లిస్ట్-ఏ క్రికెట్‌లో 17ఏళ్లకే డబుల్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా జైస్వాల్ నిలిచాడు. బుధవారం జార్ఖండ్‌తో వన్డే మ్యాచ్ సందర్భంగా యశస్వి 154 బంతుల్లో 12 సిక్సర్లు, 17 ఫోర్ల సాయంతో 203 పరుగులు చేసి ఈ ఫీట్‌ను సాధించాడు. ఈ మ్యాచ్‌లో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ముంబయి 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. అనంతరం జార్ఖండ్ జట్టు 46.4 ఓవర్లలో 319 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో...ముంబై 39 పరుగుల తేడాతో గెలిచింది. అంతకుముందు జైస్వాల్ కేరళపై 113, గోవాపై 122 పరుగులతో మెరిసిన సంగతి తెలిసిందే. అతి పిన్న వయసులోనే ప్రపంచ లిస్ట్-ఏ మ్యాచుల్లో ద్విశతకం బాదేశాడు. భారత్ తరఫున ఈ ఫీట్ సాధించిన ఏడో క్రికెటర్ గా పేరు తెచ్చుకున్నాడు.
అసలు ఈ యశస్వి జైస్వాల్ ఎవరు?? తెలుసుకుందామా??
ఉత్తరప్రదేశ్‌లోని భాడోహికి చెందిన పేద కుటుంబం నుంచి వచ్చాడు యశస్వి. ఊహ తెలిసే వయస్సు వచ్చేసరికి క్రికెట్ పై అసక్తి వచ్చింది. అతనితో పాటు అది కూడా పెరుగుతూ పోయింది. ఆట మీద ఆసక్తితో ఇల్లు, ఊరూ విడిచి ముంబై వచ్చేసాడు. ముంబై చేరుకున్న తర్వాత ఓ డైరీలో పనికి కుదిరి స్థానికంగా క్రికెట్ ఆడటం మొదలెట్టాడు. అయితే.. క్రికెట్ మీదే ఎక్కువ ఆసక్తి చూపిస్తూ పని సరిగా చేయడం లేదని ఉద్యోగంలో నుంచి తీసేసారు.
ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా యశస్వి తిరిగి ఊరు వెళ్లలేదు. మూడేళ్ల పాటు, ఆజాద్ మైదానంలోని ముస్లిమ్ యునైటెడ్ క్లబ్‌కు చెందిన గుడారాల్లో ఉన్నాడు. అందులో కనీస వసతులు ఉండేవి కాదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్రికెట్ ఆడటం.. సాయంత్రం పూట పానీపూరీ అమ్మడం, మరికొన్ని పనులు చేయడం ద్వారా జీవనం సాగించాడు. డబ్బులు సరిపోక కొన్నిసార్లు కడుపు నిండకపోయినా ఓర్చుకున్నాడు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా క్రికెట్‌ను మాత్రం విడిచిపెట్టలేదు యశస్వి. అతడి ప్రతిభ గుర్తించి స్థానిక ఆటగాళ్లు, కోచ్‌లు ప్రోత్సహించారు.
ఆ కోచ్ దృష్టిలో పడటం కీలక మలుపు
యశస్వి గురించి జ్వాలా సింగ్ అనే కోచ్‌కు తెలియడం అతడి కెరీర్‌లో అతిపెద్ద మలుపు. ఎ-డివిజన్ ఆటగాళ్ల బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు సాధిస్తున్న యశస్విని చూసిన ఆయన, అతనికి తర్ఫీదు ఇచ్చాడు. త్వరగానే ముంబై అండర్-19 జట్టుకు ఎంపికైన యశస్వి.. గత ఏడాది శ్రీలంకలో పర్యటన జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇందులో సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తో కలిసి ఎంపికయ్యాడు.
శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో చక్కటి శతకం (114) బాది భారత్‌కు సిరీస్ అందించాడు. ఇంగ్లాండ్‌లో వరుసగా నాలుగు అర్ధశతకాలతో అండర్-19 జట్టు ముక్కోణపు సిరీస్ గెలవడంలో యశస్విది ముఖ్య పాత్ర. ఇతడు ఉపయుక్తమైన స్పిన్నర్ కూడా. ప్రతి మ్యాచ్‌లోనూ అతను బౌలింగ్ చేస్తాడు.
విశాఖపట్నంలో జరిగిన విజ్జీ వన్డే ట్రోఫీలో 224 పరుగులు, 8 వికెట్లతో 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ'గా నిలిచాడు. యశస్వి ముంబై తరఫున రంజీల్లోనూ అరంగేట్రం చేశాడు.
టీనేజ్లోనే దేశవాళీ క్రికెట్లో సంచలన ప్రదర్శన చేసి టీమిండియా తలుపులు తట్టిన ముంబయి ఆటగాళ్లు సచిన్, కాంబ్లి, పృథ్వీ షాల సరసన యశస్వి చేరుతాడని అందరూ అనుకుంటున్నారు. ఇలాగే ఆడితే తప్పక భారత జట్టులో చోటు దక్కుతుంది. అతని కల త్వరలోనే నెరవేరి అతని బాధలు తీరాలని ఆశిద్దాం.