ఏపీలో కొత్తగా 17 కరోనా పాజిటివ్ కేసులు
By Newsmeter.Network
కరోనా వైరస్ మహమ్మారి ఏపీలోనూ విజృంభిస్తుంది. సోమవారం వరకు 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా. మంగళవారం మధ్యాహ్నం సమయానికి కల్లా 17 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40కి చేరింది. ఈ మేరకు మంగళవారం ఏపీ ప్రభుత్వం హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. జిల్లాల వారిగా చూస్తే.. ప్రకాశం జిల్లాలో 11 పాజిటివ్ కేసులు నమోదు కాగా, గుంటూరులో 9, విశాఖపట్టణంలో 6, కృష్ణా జిల్లాలో ఐదు, తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు, అనంతపురంలో రెండు, చిత్తూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. మంగళవారం పాజిటివ్ వచ్చిన బాధితుల్లో ఢిల్లిలో మత పరమైన ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారే ఎక్కువ మంది ఉన్నారని ప్రభుత్వం పేర్కొంది.
Also Read :ఢిల్లి ఘటనతో రాష్ట్ర ప్రజల్లో భయాందోళనలు
ఇదిలా ఉంటే ఢిల్లిలో మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లా నుంచి 79 మందిని, ప్రకాశం జిల్లా నుంచి 83 మందిని, నెల్లూరు జిల్లా నుంచి 103 మందిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలించామని, ఇంకా ఆచూకీ లభించని వారి కోసం అన్వేషన్ కొనసాగుతుందని, వారితో పాటు వారు ఏఏ ప్రాంతాల్లో తిరిగారో గుర్తించే పనిలో పడినట్లు అధికారులు తెలిపారు. ఇదిలాఉంటే ఢిల్లి మత ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారు రాష్ట్ర వ్యాప్తంగా 711 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారు వెంటనే ప్రభుత్వాస్పత్రులకు వెళ్లి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.