'చెరువు మాయం'.. కబ్జా చేసిన రియల్‌ వ్యాపారులు

By అంజి  Published on  3 March 2020 5:52 AM GMT
చెరువు మాయం.. కబ్జా చేసిన రియల్‌ వ్యాపారులు

రంగారెడ్డి: 'ప్రైడ్‌ ఇండియా'పై కేసు అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనం రాసింది. ఆ కథనం మేరకు.. బాలాపూర్‌ మండలం సుల్తాన్‌పూర్‌ పరిధిలోని అలకోని చెరువును ప్రైడ్‌ ఇండియా మ్యాన్షన్ల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ కబ్జా చేసింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఆ కంపెనీపై కేసు నమోదు చేశారు.

బాలాపూర్‌ తహశీల్దార్‌ శ్రీనివాస్‌ రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశామని ఇన్‌స్పెక్టర్‌ భాస్కర్‌ చెప్పారు. ఇటీవల అలకోని చెరువు కబ్జాకు గురైందని పలు దినపత్రికలు శీర్షికన కథనాలను ప్రచురించాయి. దీంతో బాలపూర్‌ తహశీల్దార్‌ రంగంలోకి దిగారు. అలకోని చెరువు కబ్జాకు గురవుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.

కబ్జా చేసిన కంపెనీకి నోటీసులు జారీ చేశామని, అయినా ఆ కంపెనీ నుంచి ఎలాంటి స్పందన రాలేదని తహశీల్దార్‌ వివరించారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిని కూడా కబ్జా చేశారని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ భూమిని ప్లాట్లుగా చేసి విక్రయించారని తెలిసింది. అలకోని చెరువు కబ్జాలకు సంబంధించి ప్రచురించిన కథనాలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. చెరువులను కబ్జా చేస్తే ఊరుకునేది లేదని ఆమె అన్నారు.

ఈ విషయమై వెంటనే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌ను సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. చెరువులను మాయం చేస్తే కఠిన చర్యలు తప్పవని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. అలాగే నగర శివారులోని కుంటలు, చెరువులను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె చెప్పారు.

కాగా సర్వే నంబర్‌ 65/ఏ, 66, 67, 68, 69, 70/ఎ, 71, 72 సర్వే నంబర్లలో నాలుగు ఎకరాల ఎఫ్‌టీఎల్‌ ఉందని తహశీల్దార్‌ చెప్పారు. అయితే సదరు సంస్థ మాత్రం 10.13 ఎకరాలను వెంచర్‌ చేసిందని తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌ చర్యలు చేప్టటారు.

Next Story