కల్తీ నూనె తయారీ.. చనిపోయిన పందులు, జంతువుల కళేబరాలతో..

By అంజి  Published on  2 March 2020 9:58 AM GMT
కల్తీ నూనె తయారీ.. చనిపోయిన పందులు, జంతువుల కళేబరాలతో..

ముఖ్యాంశాలు

  • జంతువుల కళేబరాలతో నూనె తయారీ
  • కొత్తూరు మండలం తిమ్మాపూర్‌లో ఘటన
  • హరిఫీడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమలో కల్తీ నూనె

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో ఓ అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. తిమ్మాపూర్‌లోని నేషనల్‌ హైవే 44కు సమీపంలోని హరి ఫీడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమ నుంచి గత కొన్ని రోజులుగా దుర్వాసన వస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు సోమవారం.. ఆ పరిశ్రమకు వెళ్లారు. అక్కడ జంతువుల కళేబారాలతో కల్తీ నూనె తయారు చేస్తున్న ముఠా బండారం బయటపెట్టారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పరిశ్రమకు చేరుకున్న పోలీసులు కల్తీ నూనెను తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. పరిశ్రమలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పరిశ్రమలో జంతు కళేబారాలతో పాటు, చనిపోయిన పందుల కళేబారాలతో కల్తీ నూనె తయారు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. కల్తీ నూనె తయారీపై ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్న అక్రమంగా కొన్ని ముఠాలు కల్తీ నూనెను తయారు చేస్తున్నాయి. డబ్బుల సంపాదన కోసం కొందరు అక్రమార్కులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్న అక్రమ వ్యాపారులు దొంగచాటుగా కల్తీ నూనెను తయారు చేసి మార్కెట్లో సోమ్ము చేసుకుంటున్నారు.

తిమ్మాపూర్‌లో గత మూడు నెలల నుంచి ఈ కల్తీ నూనె తయారీ సాగుతోందని, అర్థరాత్రి సమయంలో డీసీఎంలో జంతు కళేబరాలను తీసుకువచ్చి నూనెను తయారు చేస్తున్నారని ఓ మీడియా ప్రతినిధి తెలిపారు. గతంలో జడ్చర్ల, భూత్పూర్‌లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న ఈ వ్యవహారంలో అధికారులు తమ చేతులను కలిపారని సమాచారం.

Next Story