అయోధ్యలో 144 సెక్షన్.. ఎందుకంటే.?

By Medi Samrat
Published on : 14 Oct 2019 12:12 PM IST

అయోధ్యలో 144 సెక్షన్.. ఎందుకంటే.?

అయోధ్యలో 144 సెక్షన్ విధించారు. రామజన్మభూమి, బాబ్రీ మసీదు కేసుపై సుప్రీంకోర్టు విచారణ తుది దశకు చేరుకుంది. ఈ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును నవంబర్ 17వ తేదీన వెల్లడించనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే 144 సెక్షన్ అమలు చేశారు. దీంతోపాటు బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం డిసెంబర్ 6న కావడంతో ఎలాంటి ఉద్రిక్తతలకు తావివ్వకుండా డిసెంబర్ 10వ తేదీ వరకు అయోధ్య నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.

వారం రోజుల దసరా సెలవుల అనంతరం సోమవారం సర్వోన్నత న్యాయస్థానం తిరిగి విచారణ ప్రారంభించింది. జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం రోజువారీ విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఇప్పటికే ముస్లిం వర్గాల వాదనలు పూర్తయ్యాయి. ఈ నెల 16న హిందూ వర్గాల వాదనలు కూడా ముగించి నవంబర్ 17న తీర్పు వెలువడించనున్నారు. తీర్పు అనంతరం కూడా బాణసంచా కాల్చకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. డ్రోన్ల వినియోగం పై నిషేధం ప్రకటించారు.

Next Story