దక్షిణ ఫిలిప్పీన్స్‌లో వరుస పేలుళ్లు.. 14 మంది మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Aug 2020 2:06 PM GMT
దక్షిణ ఫిలిప్పీన్స్‌లో వరుస పేలుళ్లు.. 14 మంది మృతి

దక్షిణ ఫిలిప్పీన్స్ ద్వీపంలో భారీగా జనాభా ఉన్న ప్రాంతాలలో రెండు శక్తివంతమైన పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 14 మంది మృతి చెందగా.. 75 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం రెండు చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. మధ్యాహ్నం 12గంటలకు జోలో ప్రాంతంలో రద్దీగా ఉండే ఓ వీధిలో ఓ సూపర్‌ మార్కెట్‌ ఎదుట నిలిపిన మిలటరీ ట్రక్‌ లక్ష్యంగా చేసుకుని మొదటి పేలుడు జరగగా.. ఈ ఘటనలో ఏడుగురు సైనికులు, ఓ అధికారి ప్రాణాలు కోల్పోయారు.

మరో గంట వ్యవధి తరువాత మొదట పేలుడు జరిగిన ప్రదేశానికి 70 మీటర్ల దూరంలోని ఓ చర్చిలో రెండో పేలుడు సంభవించింది. ఇక్కడ ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు చోట్ల జరిగిన పేలుళ్లలో మరో 75 మందికి గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ పేలుళ్లపై ఫిలిప్పీన్స్ రెడ్ క్రాస్ చీఫ్ రిచర్డ్ గోర్డాన్ మాట్లాడుతూ.. దేశంలోని దక్షిణ ప్రావిన్సులలో ఒకటైన సులు రాజధానిలో సోమవారం మధ్యాహ్నం మొదటి పేలుడు సంభవించిందని తెలిపారు. పేలుడు పదార్థాలు ధరించిన ఓ సూసైడ్‌ బాంబర్‌.. ద్విచక్రవాహనం పై వచ్చి మిలటరీ ట్రక్‌ లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతికి పాల్పడినట్లు తెలిపారు. ఇదిలా ఉంటే.. ఈ పేలుళ్లకు కారణం ఎవరనేది ఇంకా తెలియరాలేదు. ఈ పేలుళ్లకు తామే కారణమని ఇప్పటివరకు ఏ ఒక్క తీవ్రవాద సంస్థ కూడా ప్రకటించలేదు.

Next Story