అవినీతి ఆరోపణలపై ప్రశ్నించినందుకు.. జర్నలిస్ట్‌పై బ్రెజిల్ అధ్యక్షుడు ఫైర్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Aug 2020 10:19 AM GMT
అవినీతి ఆరోపణలపై ప్రశ్నించినందుకు.. జర్నలిస్ట్‌పై బ్రెజిల్ అధ్యక్షుడు ఫైర్‌

బ్రెజిల్ అధ్యక్షుడు జైర్‌ బోల్సొనారో మరోసారి నోరుపారేసుకున్నారు. అవినీతి కుంభకోణంపై ప్రశ్నించిన ఓ రిపోర్టర్‌ పై ఆయన మండిపడ్డారు. తాజాగా బోల్సొనారో మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా.. ఆయన భార్య మిచెల్లి బోల్సోనారోపై వస్తున్న అవినీతి ఆరోపణలపై ఓ విలేకరి ప్రశ్నించడంతో.. సహనం కోల్పోయిన అధ్యక్షుడు నీ మూతి వాయగొడతానంటూ జర్నలిస్ట్‌ పై ఫైర్‌ అయ్యారు.

బోల్సొనారో ప్రతి ఆదివారం బ్రెసీలియాలోని మెట్రోపాలిటన్‌ క్యాథడ్రల్‌ చర్చిని సందర్శిస్తుంటారు. ఈ ఆదివారం కూడా అక్కడికి వచ్చారు. అక్కడ ఓ జర్నలిస్ట్‌ బోల్సొనారో భార్య మిచెల్లి బోల్సొనారోపై వచ్చిన అవినీతి ఆరోపణల గురించి ప్రశ్నించారు. దీంతో ఆగ్రహానికి గురైన బోల్సొనారో అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. మూతి పగులగొడతానంటూ అతడిపై విరుచుకుపడ్డారు. వెంటనే అక్కడున్న జర్నలిస్టులు నిరసనలకు దిగారు. అయితే వీటిని పట్టించుకోకుండా ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రభుత్వ నేతగా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన బోల్సొనారో తన బాధ్యతలను విస్మరించి ఇటువంటి వ్యాఖ్యలు చేయడమేంటని అక్కడి మీడియా కథనాలను ప్రచురించింది.

బోల్సొనారో మిత్రుడు, మాజీ పోలీసు అధికారి ఫ్యాభ్రీసియో కీరోజ్‌తో కలిసి మిచెల్లి బోల్సోనారో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల కుంభకోణానికి పాల్పడ్డారంటూ అక్కడి పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి.

Next Story