ఏపీలో కలకలం.. పశ్చిమ గోదావరి జిల్లాలో 14 కరోనా పాజిటివ్‌ కేసులు

By Newsmeter.Network  Published on  1 April 2020 3:55 AM GMT
ఏపీలో కలకలం.. పశ్చిమ గోదావరి జిల్లాలో 14 కరోనా పాజిటివ్‌ కేసులు

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారి భారత్‌లోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే భారత్‌లో 1600 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఏపీలోనూ కరోనా విజృంభిస్తుంది. రెండురోజుల క్రితం వరకు 23 కరోనా పాజిటివ్‌ కేసులు ఉండగా.. మంగళవారం రాత్రి వరకు 44 కేసులు నమోదయ్యాయి. మంగళవారం సాయంత్రం 6గంటల తర్వాత నాలుగు కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ నాలుగు కేసులు విశాఖ పట్టణం నగరంలోనే నమోదైనట్లు తెలిపారు. వీరందరూ ఢిల్లిలో జరిగిన మతపరమైన సమ్మేళనంలో పాల్గొన్నట్లు తేలింది. ఇదిలా ఉంటే తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో 14 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఏపీలో కలకలం రేపుతుంది. ఏలూరులో 6, భీమవరంలో 2, పెనుగొండలో 2, ఉండి, గుండుగొలను, ఆకివీడు, నారాయణపురంలో ఒక్కొక్కటి చొప్పున కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు.

Also Read :కరోనాపై పోరు.. వ్యాక్సిన్‌ కోసం రంగంలోకి జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌

జిల్లాలో మొత్తం 30 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపిన కలెక్టర్‌.. వైద్య పరీక్షల్లో 14మందికి పాజిటివ్‌ వచ్చిందని, 10మందికి నెగిటివ్‌ వచ్చిందని, ఇంకా ఆరుగురికి సంబంధించిన నివేదికలు రావాల్సి ఉందని ఆయన తెలిపారు. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 58కి చేరింది. అయితే ఈ కరోనా పాజిటివ్‌ కేసులను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ధ్రువీకరించాల్సి ఉంది. కరోనా వైరస్‌ ప్రభావం ఏపీలో అంతగా లేదని భావిస్తున్న తరుణంలో ఒక్కసారిగా తీవ్రస్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఏపీ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తుంది. ఈ రెండు రోజుల్లో పాజిటివ్‌ వచ్చిన వారిలో ఢిల్లిలో జరిగిన మతపరమైన సమ్మేళనంలో పాల్గొన్న వారే ఎక్కువగా ఉండటం మరింత ఆందోళనకు గురిచేస్తుంది. వారి ద్వారా కాంటాక్ట్‌ కేసులు ఇంకెన్ని పెరుగుతాయోనని అధికారులుసైతం ఆందోళన చెందుతున్నారు.

Also Read : తెలంగాణలో మద్యం షాపులు అప్ప‌టివ‌ర‌కూ బంద్.. ఉత్తర్వులు జారీ

Next Story