44 కుటుంబాల ద్వారా 265 మందికి కరోనా
By తోట వంశీ కుమార్ Published on 24 April 2020 7:35 PM ISTతెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కొత్తగా నమోదైన కేసులతో కలిసి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 983కి చేరిందన్నారు. కరోనా నుంచి కోలుకుని నేడు 29 మంది డిశ్చార్జి అయినట్లు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జి అయి ఇంటికి చేరుకున్న వారి సంఖ్య 291కి చేరిందని, 663 మంది ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో ఏడుగురు వెంటిలేటర్ పై ఉన్నారని, కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 25మంది మరణించినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లోనే అత్యధిక కేసులు నమోదయ్యాయని ఈటల తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 44 కుటుంబాల ద్వారా 265 మంది కరోనా బారిన పడ్డారన్నారు. వికారాబాద్‌లో 14కుటుంబాల నుంచి ఎక్కువగా కేసులు నమోదైనట్లు తెలిపారు. సూర్యాపేటలో 25కుటుంబాల నుంచి 83 మందికి, గద్వాలలో 30 కుటుంబాల నుంచి 45 మందికి కరోనా సోకిందని వివరించారు.
సోషల్ మీడియాలో గాంధీ ఆస్పత్రిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి ఈటల ఆగ్రహాం వ్యక్తం చేశారు. గాంధీ ఆస్పత్రిని సంపూర్ణ కొవిడ్ ఆస్పత్రిగా మార్చామన్నారు. పాత ఫోటోలతో కొందరు దుష్ప్రాచారం చేస్తున్నారన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక వైద్యులపై దాడులకు పాల్పడితే.. ఉపేక్షించేది లేదన్నారు.