టీఎస్ఆర్టీసీని కాపాడడానికి 11మార్గాలు..!: ప్రొఫెసర్ నాగేశ్వర్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 Oct 2019 10:28 AM GMTఆర్టీసీ కార్మిక సంఘ నేతలతో చర్చలు జరపడానికిగాను ఐఏఎస్ అధికారులతో కూడిన ఒక కమిటీని తెలంగాణా కేబినెట్ నియమించింది. ఒకసారి గతంలోకి వెలితే..పండగ నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. తమ డిమాండ్లకు ఒప్పుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ వారు ఈ పని చేశారు. అప్పటి నుంచీ కార్మిక సంఘాలకు, ప్రభుత్వానికి మధ్యన మొదలైన గొడవ కొనసాగుతూనే వుంది. ఈ సమ్మె కారణంగా ఒక విషయం అందరి దృష్టికీ వచ్చింది. అదేంటంటే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను పునరుద్దరించడం ఎలా అనేదాని మీద సర్వత్రా చర్చలు నడుస్తున్నాయి.
కమిటీలకు, అధ్యయనాలకు కొదవ లేదు. లేనిదేందంటే.. ఆర్ధికంగా నష్టాల్లో కూరుకుపోయిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను పైకి తీసుకురావడానికిగాను అవసరమైన రాజకీయ చిత్తశుద్ధి. ఆర్టీసీని నస్టాల ఊబిలోంచి బైటకు తీసుకు రావడానికి నాకు తెలిసిన 11 అంశాలను చెబుతాను. ప్రభుత్వం వీటిని అమలు చేస్తే సమ్మెలకు తావుండదు. ఆర్టీసికి ఆర్ధిక వెన్నుదన్ను లభిస్తుంది.
1. పన్నుల భారం తగ్గించండి
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు ప్రతి ఏడాది రూ. 720 కోట్ల నష్టాలు వస్తున్నాయి. ఆ సంస్థకు ఇప్పటికే రెండువేల కోట్ల రూపాయల నష్టంలో వుంది. ఇంధనం వినియోగంలో, మానవ వనరుల ఉపయోగంలో, టైర్లను ఉపయోగించడంలో, ప్రయాణికుల ఆదరణ మొదలైన విషయాల్లో ఆర్టీసీ సమర్థవంతంగా వున్నప్పటికీ ఈ నష్టాలు వస్తున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోంది?
విద్య, ఆరోగ్య, సురక్షిత సాగునీరు, పరిసరాల పారిశుద్ధ్యం మొదలైన సేవలందిస్తున్నట్టుగానే ప్రజా సేవరంగంలోని సంస్థ ఆర్టీసీ. ప్రజలకు తప్పనిసరిగా అందించాల్సిన రవాణా సేవారంగం ఆర్టీసి. అయినప్పటికీ దీనిపైన పన్నుల భారం భారీగా వుంటోంది. ప్రజా రవాణా వ్యవస్థ విస్తృతంగా అందుబాటులోకి వచ్చి సేవలందిస్తే అది సామాజిక, ఆర్ధిక అభివృద్ధికి దోహదం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు ప్రజా రవాణా వ్యవస్థ అనేది అభివృద్ధికి ఉపయోగపడే కీలకమైన మౌలిక వసతి. అయితే ఆశ్చర్యకరంగా ప్రభుత్వం అలా భావించడం లేదు. ఈ ముఖ్యమైన రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిపోయి...దీన్ని ఆదాయ వనరుగా చూస్తోంది. తద్వారా ఆర్టీసీ సంస్థ నష్టాలను మూటగట్టుకుంటోంది. అంతే కాదు నిత్యం విమర్శలపాలవుతోంది.
ఆర్టీసీ చేస్తున్న వ్యయంలో ప్రధాన భాగం ఇంధనానికి, జీతాలకు పోతుంది. ప్రజారవాణా వ్యవస్థ అనేది ఉద్యోగుల మీద ఆధారపడే నడుస్తుంది. కాబట్టి మానవవనరుల మీద ఖర్చు పెట్టకుండా తప్పించుకోలేం. అయినప్పటికీ అధికార గణాంకాల ప్రకారం చూస్తే ఆర్టీసీ పెడుతున్న మొత్తం వ్యయంతో మావవనరులపై పెట్టే వ్యయాన్ని పోలిస్తే మానవవనరుల వ్యయంలో పెరుగుదల చాలా తక్కువగా మాత్రమే వుంది. ఒక పక్క సేవలు విస్తరిస్తున్నప్పటికీ మానవవనులపై పెడుతున్న వ్యయంలో పెరుగుదల తక్కువగా నమోదు కావడం గమనార్హం. ఇది ఆర్టీసీ కార్మికుల సామర్థ్యాన్ని సూచిస్తోంది. మరోవైపు ఇంధన ధరలు ప్రతి ఏడాది పెరుగుతూనే వున్నాయి. తద్వారా ఇంధనంపై పన్నులు కూడా పెరుగుతూనే వున్నాయి. ప్రతి ఏడాది డీజిల్ కోసం తెలంగాణా ఆర్టీసీ రూ. 1,300 కోట్లు ఖర్చు చేస్తోంది. అంటే ఈ సంస్థ ఇంధనంకోసం చేస్తున్న ఖర్చులో సగందాకా పన్నులకే పోతుంది. ఈ పన్నుల మీద వచ్చే ఆదాయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి.
తెలంగాణలో ఇంధనాలపైన వేసే పన్నుల్లో డీజిల్ పైన వేసే పన్ను అధికంగా వుంటుంది. కాబట్టి డీజిల్ కోసం తెలంగాణ ఆర్టీసీ ఖర్చు చేసే డబ్బులో రూ.300 లదాకా తిరిగి పన్నుల రూపంలో తెలంగాణ ప్రభుత్వానికి చేరుతుంది. ఈ పన్ను ఆదాయాన్ని తిరిగి ఆర్టీసీకి ఇస్తే ఆర్టీసీ కి వస్తున్న నష్టాల్లో 40 శాతం దాకా తగ్గుతాయి. రైల్వేరంగంలో చేసినట్టుగా ఆర్టీసీపై వేసే పన్నులను తగ్గిస్తే అది ఆర్టీసీని గణనీయంగా ఆదుకుంటుంది. ఇది ఎప్పటినుంచో వున్న డిమాండ్ గతంలో సమైక్య ఆంద్రప్రదేశ్‌లోని ప్రభుత్వాలు గానీ, తర్వాత వచ్చిన తెలంగాణ ప్రభుత్వం గానీ ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు.
బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆప్ మేనేజ్ మెంట్ ( ఐఐఎం) నిపుణులతో ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను నాటి సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు సమర్పించింది. నష్టాలు వస్తున్న రూట్లలో పన్నులనైనా తొలగించాలని ఆ కమిటీ పేర్కొంది. వాణిజ్య పరంగా లాభాలు లేకపోయినా ప్రభుత్వం తరఫున ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలనే సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్న సంస్థ ఆర్టీసీ కాబట్టి ప్రభుత్వ ఈ పన్నులను ఎత్తేయాలని కమిటీ సూచించింది. డీజిల్ పై పన్నులతోపాటు రూ.290 కోట్ల మేరకు మోటారు వాహనాల పన్నును ప్రతి ఏడాది ఆర్టీసీ చెల్లిస్తుంది. అలాగే విడిభాగాల కోసం రూ.150 కోట్లు చెల్లిస్తుంది. ఈ మూడు విభాగాల కింద చెల్లిస్తున్న పన్నుల విలువ దాదాపు రూ. 740 కోట్లు అయితే ఆర్టీసీకి వస్తున్న నష్టం రూ.720 కోట్లు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న అధిక పన్నుల కారణంగానే ఆర్టీసీ నష్టాలను మూటగట్టుకుంటున్నది. వీటికి తోడు కేంద్రప్రభుత్వం వేసే పన్నులు కూడా వున్నాయి.
2.డీజిల్ కోసం చేసే వ్యయాన్నించి ఆర్టీసికి విముక్తి కలిగించండి. తమిళనాడును ఆదర్శంగా తీసుకోండి...!
2015లో ఆర్టీసీ చేసిన మొత్తం వ్యయంలో 20 శాతం డీజిల్ కు ఖర్చు పెట్టారు. ఇది ఇప్పుడు 32 శాతానికి చేరుకుంది. అయితే.. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు చెల్లిస్తున్న జీతభత్యాలు 2015లో 54.85 శాతముంటే.. అది 2018-19 నాటికి 56 శాతానికి చేరుకుంది. డీజిల్ కోసం చేస్తున్న వ్యయ నియంత్రణ అనేది ఆర్టీసీ చేతుల్లో లేదనే విషయం ఇక్కడ గమనార్హం. ప్రతి ఏడాది పెరుగుతున్న ఇంధన ధరల నుంచి ఆర్టీసీని కాపాడడానికి తమిళనాడు ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఈ ధరలను 2011-12లో ఎంత వున్నాయో అంతే వుండేలా నిర్ణయం తీసుకుంది. అంటే ఆ తర్వాత పెరిగిన ఇంధన ధరలను ప్రభుత్వం రీ ఇంబర్స్ చేస్తోంది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వాన్ని ఎందుకు ఆదర్శంగా తీసుకోదు?.
3.బడ్జెట్ మద్దతును అందించండి
ప్రజా రవాణావ్యవస్థకు మద్దతుగా అభివృద్ధి చెందిన దేశాలు అనేక చర్యల తీసుకుంటున్నాయి. ఇందులో ఒకటి బడ్జెట్ పరమైన మద్దతు ఇవ్వడం. అయితే ఈ విషయంలో మన దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు ముందడుగు వేయడం లేదు. తమ బాధ్యతను నిర్లక్ష్యం చేస్తున్నాయి. అనేక ముఖ్యమైన కమిటీలు సిఫార్సులు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదు.
4.వియబిలిటీ గ్యాప్ ఫండింగ్ అందించాలి
పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పిపిపి) కింద చేపట్టిన మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల విషయంలో కూడా ప్రభుత్వం వియబిలిటీ గ్యాప్ ఫండింగ్ అందిస్తోంది. దీనికి ఎల్ అండ్ టి మెట్రో యే ముఖ్య ఉదాహరణ. మెట్రో లాంటి ప్రజా రవాణా వ్యవస్థ వియబిలిటీ గ్యాప్ ఫండింగ్ పొందుతుంటే ప్రభుత్వ యాజమాన్యంలో వున్న ఆర్టీసీ ఎందుకు పొందడం లేదు? ప్రజా రవాణా వ్యవస్థకోసం చేసే మొత్తం ఖర్చును ఆ సంస్థలు మాత్రమే భరించడమనేది ప్రపంచంలో ఎక్కడా లేదు.
5.ఆర్టీసీ ఆస్తులను వాణిజ్యపరంగా వినియోగించాలి
ప్రభుత్వం హైదరాబాద్ లో విలువైన భూములను సుదీర్ఘకాలం లీజుకింద మెట్రోకు అందించింది. తద్వారా ఆ సంస్థ వాటిని అభివృద్ధి చేసుకొని లబ్ధి పొందుతుంది. మెట్రో రవాణ సంస్థ ఆదాయానికి ఇది దోహదం చేస్తుంది. అదే పనిని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ విషయంలో చేయవచ్చు. ఇందుకోసం ఆర్టీసీ ప్రత్యేక విభాగాన్ని రూపొందించి ( స్పెషల్ పర్పస్ వెహికల్) దాని ద్వారా ప్రభుత్వం లీజుకింద ఇచ్చే స్థలాలను, ఇప్పటికే ఆ సంస్థ దగ్గర వున్న స్థలాలను వాణిజ్యపరంగా అభివృద్ధి చేసుకోవచ్చు. నిజానికి ఈ ఆలోచనపై ప్రభుత్వం కొంత కసరత్తు చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం తన విధానాన్ని ప్రకటించాలి.
6.విడిభాగాల తయారీ
విడిభాగాల కొనుగోలుకోసం ఆర్టీసీ పెద్ద మొత్తంలో ఖర్చుపెడుతోంది. గతంలో సమైక్యాంధ్రప్రదేశ్ లో టైర్ల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయడానికిగాను నాటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు మంగళగిరి దగ్గర స్థలాన్ని కేటాయించారు. ఈ విధానాన్ని కొనసాగించి ఆర్టీసీ తనే సొంతంగా విడిభాగాలను తయారు చేసుకుంటే తద్వారా ఆర్టీసీకి తక్కువ ధరలో విడిభాగాలు లభిస్తాయి.అంతే కాదు ఈ విడిభాగాల తయారీ యూనిట్లు తమ ఉత్పత్తులను బహిరంగ మార్కెట్లో అమ్ముకొని లబ్ధి పొందవచ్చు.
7.అద్దె బస్సుల భారం
అద్దెకు తీసుకున్న బస్సుల కారణంగా ఆర్టీసీపై అదనపు భారం పడుతోంది. రాజకీయ నాయకులు, కొంత మంది ఆర్టీసీ నేతలు బినామీ పేర్ల మీద ఆర్టీసీకి అద్దె బస్సులను సరఫరా చేస్తున్నారు. ఈ విధానంవల్ల ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయని అధికార గణాంకాలద్వారా తెలుస్తోంది. ఈ గణాంకాల ప్రకారం చూస్తే అద్దె బస్సులతో పోల్చినప్పుడు ఆర్టీసీ సంస్థ సరాసరి ఒక ఆర్టీసీ బస్సుద్వారా ప్రతి రోజూ రూ.2,577 అదనంగా సంపాదిస్తోంది. అద్దెకు తీసుకున్న బస్సుల ద్వారా ఆర్టీసికి ఎంత నష్టం వస్తోందో ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. సొంత, అద్దె బస్సుల విషయంలో ఇంత తేడా ఎందుకు వుందో దానికి గల కారణాలను ఆర్టీసీ యాజమాన్యం వివరించాలి.
8.వస్తు రవాణాకు అనుమతి ఇవ్వండి
పూర్తి స్థాయిలో సమగ్రంగా ఆర్టీసీలో వస్తు రవాణా సౌకర్యాన్ని ప్రవేశపెట్టాలనేది ఎప్పటినుంచో వున్న డిమాండ్. ఇందుకోసం ఆర్టీసీకి కావాల్సిన సౌకర్యాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్యనే పార్సిల్ రవాణా సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ప్రతి ఏడాది రూ.120కోట్లు సంపాదిస్తోంది. వస్తు రవాణా సౌకర్యాన్ని మొదలుపెట్టడంద్వారా దీని ద్వారా కూడా తెలంగాణ ప్రభుత్వం మరింత అధికంగా సంపాదించవచ్చు. ఒక బస్సు పదిలక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన తర్వాత అది ప్రయాణికుల రవాణాకు అనుగుణంగా వుండదు కాబట్టి దాన్ని పక్కన పెడతారు. వీటిని వస్తు రవాణాకు ఉపయోగించుకోవచ్చు. ప్రభుత్వం పౌర సరఫరాల వ్యవస్థ కు వస్తు రవాణా చేసే ఆర్డర్లను ఆర్టీసీకి ఇవ్వవచ్చు.
9.సమగ్ర రవాణా యాజమాన్యం
తన సేవలను విస్తరించడంద్వారా ఆర్టీసీ తన ఆదాయాన్ని పెంచుకోవచ్చు. ముఖ్యంగా మెట్రోలాంటి సంస్థలతో కలిసి మెట్రో స్టేషన్లకు సమీపంలోని కాలనీలకు మినీ బస్సులను నడపవచ్చు. దీనిద్వారా అటు ఆర్టీసికి, ఇటు మెట్రోకు లాభదాయకంగా వుంటుంది.
10.రహదారి మౌలిక వసతుల అభివృద్ధి
నాణ్యత లేని రోడ్ల కారణంగా, ట్రాఫిక్ నిర్వహణా వ్యవస్థ సరిగా లేకపోవడంవల్ల ప్రజా రవాణా వ్యవస్థ నెమ్మదిగా నడుస్తోంది. దీనివల్ల ఇంధన వినియోగ సామర్థ్యం తక్కువ స్థాయిలో వుంటుంది. నగరాల్లో ఈ సమస్య అధికంగా వుంది. ఒక హైదరాబాద్ నగర రవాణాలోనే తెలంగాణా ఆర్టీసీ ప్రతి ఏడాది రూ.400 నష్టాన్ని చవిచూస్తోంది. రోడ్ల నిర్వహణ అనేది ఆర్టీసీ బాధ్యత కాదు. ఈ ముఖ్యమైన మౌలిక వసతిని కల్పించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది.
11.అక్రమంగా నడుస్తున్న ప్రైవేటు వాహనాలు
ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నడుస్తున్న ప్రైవేటు వాహనాల దందాను అరికట్టాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా చేష్టలుడిగిపోయినట్టుగా వ్యవహరిస్తోంది. ప్రైవేటు బస్సులు స్టేజి క్యారియర్లుగా పని చేయకూడదు. టూరిస్టు బస్సులుగా మాత్రమే పని చేయాలి. ఒక అనుమతి తీసుకొని ఒకటికంటే ఎక్కువగా బస్సులు నడుపుతున్నారు. అంతే కాదు లాభాలు వచ్చే సుదూర ప్రాంతాల రూట్లను ప్రైవేటు ఆపరేటర్లకు ఇస్తున్నారు. అంటే లాభాలను ప్రేవేటీకరణ చేసి నష్టాలను జాతీయరణ చేస్తున్నారన్నమాట.
- ప్రొఫెసర్ కె. నాగేశ్వర్, మాజీ ఎమ్మెల్సీ